Dharamshala: దలైలామా వారసుడి గుర్తింపు అధికారం ఎవరిది..? చైనా అభ్యంతరాలపై భారత్ స్పందనేంటి..?

దశాబ్దాలుగా చైనా (China) ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ నిలిచిన ఏకైక ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) .. ప్రస్తుతం భారత్ లోని ధర్మశాలలో నివసిస్తున్నారు. ఇక్కడి నుంచే టిబెటన్లకు మార్గనిర్దేశనం చేస్తున్నారు దలైలామా.. టిబెట్ పై చైనా ఆక్రమణల వేళ .. అక్కడి నుంచి వలసొచ్చిన దలైలామా.. ఇప్పటికీ బౌద్దుల మత గురువుగానే ఉన్నారు. ఆయనను పక్కకు తప్పించేందుకు చైనా చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితమివ్వలేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఆయనను ఇప్పటికీ.. బౌద్దుల ఆధ్యాత్మిక గురువుగానే చూస్తోంది.
అయితే.. ఇప్పుడు దలైలామా వయసు 90 ఏళ్లు.. ఆయన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. దలైలామా వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ చైనాలోనే జరుగుతుందని.. బీజింగ్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆ ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు దలైలామా.. తమ వారసుడి ఎంపిక టిబెటన్లకు ఉంటుందన్నారు.
అంతకుమునుపు, ఈ విషయంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ .. దలై లామాకు తన వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం, హక్కు ఉన్నాయని అన్నారు. తదుపరి దలై లామా ఎంపికకు తమ ఆమోదం తప్పనిసరి అని చైనా పేర్కొనడంపై మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దలై లామా కేవలం టిబెటన్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆధ్యాత్మిక గురువు అని అన్నారు.ఈ కామెంట్స్‌పై స్పందించిన చైనా టిబెట్ విషయాల్లో భారత్ ఆచితూచి స్పందించాలంటూ ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని పేర్కొంది.
టిబెట్ ఆధ్యాత్మిక మత గురువు దలై లామా వారసుడి ఎంపికపై చైనా అభ్యంతరాల నడుమ భారత్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మతపరమైన అంశాలు, సంప్రదాయాల విషయంలో ప్రభుత్వం స్పందించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘దలై లామా ప్రకటన గురించి వచ్చిన వార్తలను మేము చూశాము. అయితే, మతపరమైన అంశాలు, విశ్వాసాల విషయాల్లో భారత ప్రభుత్వం స్పందించదు. భారత్‌లో ఉండే వారందరికీ మతపరమైన విషయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇదే తీరు కొనసాగుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
టిబెట్ తదుపరి దలై లామా ఎవరన్న విషయంపై చర్చ పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు. చైనా టిబెట్‌ను ఆక్రమించుకున్నాక అక్కడ నుంచి అనేక మంది బౌద్ధులు భారత్‌కు వలసొచ్చారు. అయితే, మతపరమైన విషయాల్లో తమది తటస్థ వైఖరి అని భారత్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది.