White house: భారత చమురు కంపెనీలపై ఆంక్షలు.. అమెరికా మరోషాక్..

భారత్‌పై అమెరికా 25శాతం సుంకాల విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మన చమురు కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం (Iran Oil) ఉత్పత్తులను కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారన్న అభియోగాలపై ప్రపంచవ్యాప్తంగా 20 సంస్థలపై వాషింగ్టన్ చర్యలు (US Sanctions) చేపట్టింది. ఇందులో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
‘‘చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మధ్య ప్రాచ్యంలో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ (Iran) ఆజ్యం పోస్తోందన్నది అమెరికా ఆరోపణ. సొంత దేశ ప్రజలతో పాటు, ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థిక మద్దతు కల్పిస్తోందని… అందుకే టెహ్రాన్‌పై ఆర్థికఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు చేపట్టిందని వైట్ హౌస్ స్పష్టం చేసింది.. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాం’’ అని అగ్రరాజ్యం తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
భారత్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీల (Indian Companies)పైనా ఈ ఆంక్షలు విధించింది. ‘‘అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చెప్పినట్లు ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక, అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారు’’ అని వాషింగ్టన్ ఈ సందర్భంగా హెచ్చరించింది.