Delhi: సిందూర్ వార్ ఆపే సత్తా అమెరికా కు లేదా..? పెద్దన్న ఎందుకు దూరంగా ఉంటున్నాడు…?

అగ్రరాజ్యం అమెరికా.. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా.. ఎక్కడ యుద్ధమేఘాలు ఆవరించినా.. ఎక్కడ ఏ దేశం ఎవరితో ఒప్పందాలు చేసుకున్నా.. వెంటనే అక్కడ వాలిపోతుంది. తన ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు పక్కాగా ప్లాన్ తో ఎంటరవుతుంది. తనకు ఆర్థిక, రాజకీయ, వ్యాపార, ఆయుధపరంగా లాభం ఉండేలా పావులు కదుపుతుంది. ప్రపంచానికి గ్లోబల్ పవర్ తామే కాబట్టి.. తాము చెప్పినట్లు అంతా జరగాలన్నది అమెరికా అభిమతంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అమెరికా కేవలం .. తన ప్రయోజనాలకు మాత్రమే పరిమితమవుతోంది.. అమెరికా ఎందుకిలా ప్రవర్తిస్తోంది.?
దశాబ్దాల పాటు తమ ఆధిపత్యం కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు అగ్రరాజ్యాన్ని సైతం అప్పుల పాల్జేశాయి. చాలా వరకూ తాను కూడా ఆర్థికంగా దిగజారిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు ప్రపంచంలో పలుదేశాలు, సంస్థలకు సహాయం అందజేస్తోంది. ఈపరిణామాలు అమెరికాను ఆర్థికంగా సమస్యల్లోకి తోశాయి. వీటన్నింటినీ గుర్తించిన ప్రస్తుత ట్రంప్ సర్కార్.. కొత్త విధానాన్ని నిర్దేశిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా.. అది అమెరికాప్రయోజనాలకు అనుగుణంగా ఉందా లేదా.. ఏ అంశంలో జోక్యం తమకు ప్రయోజనకరం కాదో అక్కడికి వెళ్లడం లేదు. మన ఒక్కరికే ఎందుకీ బాధ అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump).. స్వయంగా ఈ విషయాన్ని పలువేదికల్లో తెలిపారు. అంతేకాదు.. అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశారు ట్రంప్. ఇప్పుడు అదే విధానానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారు. తమ దేశానికి ప్రయోజనకరం అయిన అంశాలను పక్కాగా చేపడుతున్నారు. అందులో భాగంగా టారిఫ్ వార్ విధించారు. దాన్ని పద్దతి ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచమంతా తాము చెప్పినట్లు వినాలని నిర్దేశించారు. అందులోనూ కొంతవరకూ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
లేటెస్టుగా భారత్, పాక్ అనధికారిక యుద్ధంలోనూ అమెరికా ఎటువైపు నిలువకుండా సమదూరం పాటించింది. ఇరుదేశాలు నేరుగా చర్చలు జరపాలని.. తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. గతంలో అయితే ఇలాంటి విషయాల్లో అమెరికా నుంచి ఏదో దేశానికి నేరుగా ఫోన్ వచ్చేది. యుద్ధం ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలుండేవి. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అమెరికా కూడా తనవరకూ తాను పరిమితమవుతోందని చెప్పక తప్పదు.