Trump: ఈసారి యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ నాదే.. ఇజ్రాయెల్, ఇరాన్ సుఖంగా ఉండాలన్న ట్రంప్..

ఆపరేషన్ సిందూర్ ఆపిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించి భంగపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump).. ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకున్నారు. ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో విజయం సాధించారు. తాను ఈ యుద్ధాన్ని ఆపగలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. అంతకంటేముందే ఇరాన్ (Iran) అణుకేంద్రాలను ధ్వంసం చేయడం తనకు లభించిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘యుద్ధం ఆగాలని ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ సమానంగా కోరుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపా’’ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మరోవైపు, ఇరాన్ పాలనపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ప్రభుత్వం మారాలని తాను కోరుకోవడం లేదని తెలిపారు. నాటో సదస్సు నిమిత్తం నెదర్లాండ్స్ బయల్దేరుతుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌లో నాయకత్వ మార్పు అవసరమా? అని అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘వద్దు.. అలా జరగాలని కోరుకోవట్లేదు. అన్ని సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయి. పాలన మారడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి’’ అని తెలిపారు.
ట్రంప్ తాజా సమాధానం.. గత వారం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉండటం గమనార్హం. ‘‘నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయపరంగా సరైంది కాదేమో.. కానీ, ప్రస్తుత ఇరాన్ పాలకులు ‘మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్ (MIGA)’ దిశగా పనిచేయకపోతే.. నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదు?’’ అని ఇటీవల ఆయన తన ట్రూత్ సోషల్‌లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే.