Indian Man Dead: దీపావళి నాడు సౌతాఫ్రికాలో తెలుగు యువకుడు మృతి!

దీపావళి పండుగ వేళ సౌతాఫ్రికాలో భారతదేశానికి చెందిన యువకుడు (Indian Man Dead) మరణించాడు. మృతుడిని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (32)గా గుర్తించారు. సౌతాఫ్రికాలో బోరు బండి ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం అందింది. సౌతాఫ్రికాలో ఉంటున్న ఇంటి వెనుకే చెట్టుకు ఉరి వేసుకుని శ్రీనివాస్ (Srinivas) మృతిచెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే అక్కడి నుంచి పంపిన ఫోటోలను పరిశీలించిన కుటుంబ సభ్యులు, ఇది ఆత్మహత్య కాదని, దారుణంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.
ఐదు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి వెళ్లిన శ్రీనివాస్ (Srinivas).. ఐదు సంవత్సరాలుగా సౌతాఫ్రికాలో పనిచేస్తున్నాడు. భార్య నవనీత, కూతురు లాస్య, కుమారుడు నిహాల్, తల్లిదండ్రులు ఈ వార్త విని కన్నీరుమున్నీరయ్యారు. పండుగ రోజు వచ్చిన ఈ వార్త వారి ఆనందాన్ని కబళించింది. మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి సుమారు మూడు నుండి నాలుగు రోజులు పట్టవచ్చని సమాచారం.