Delhi: ఆ మూడు దేశాలే భారత్ పాలిట విలన్లా..? వారిని ఎదురించేందుకు ఎలాంటి వ్యూహం కావాలి..?

పహల్గామ్ ఉగ్రదాడి నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్‌కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్‌పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్‌లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
అయితే, ఇవి సాధారణ ప్రయోగాలు కావని తేలింది. భారత రాడార్లలో వీటి ప్రయోగం ప్రమాదకరంగా ఆలస్యంగా కనిపించాయని తెలుస్తోంది. దీనికి ఫ్యూజన్ ఆపరేషన్ అని పిలువబడే ఒక కొత్త యుద్ధ వ్యూహంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఈ క్షిపణుల నిర్వహణకు ‘‘థర్డ్ పార్టీ’’ ఆపరేటర్లను, బహూశా చైనా నిపుణులు పనిచేసినట్లు తెలుస్తోంది. వీరు రిమోట్‌గా శాటిలైట్స్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ & కమాండ్ సిస్టమ్స్ (AEW&CS) ఉపయోగించి క్షిపణులకు ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటి వెనక డ్రాగన్ కంట్రీ వ్యూహాలు ఉన్నాయనేదానిపై క్లారిటీ వచ్చింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థ చాలా క్షిపణులను అడ్డుకుని, పేల్చేసింది.
పహల్గామ్ దాడిలో కూడా చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు బీడౌ-ఎనేబుల్డ్ నావిగేషన్ పరికరాలను వాడినట్లు దర్యాప్తు చేస్తున్న భారత దళాలు గుర్తించాయి. వీరు చైనీస్ జీపీఎస్ అయిన బీడౌని వాడారు. ఇవి చొరబాటుదారులు సంప్రదాయక టెలికాం గ్రిడ్లపై ఆధాపడకుండా చేస్తుంది. దీని ద్వారా వారిని కనిపెట్టడం కష్టమవుతుంది.
దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో హువావే మేట్ 60 స్మార్ట్‌ఫోన్ లభించింది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు, నేరుగా చైనా టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్ వర్క్ కి కనెక్ట్ అవుతుంది. బ్లాక్ అవుట్ సమయంలో కూడా కాల్స్ చేయడానికి, మెసేజ్ పంపించడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు, టర్కిష్ డ్రోన్లను కూడా పాక్ భారత్‌పై ప్రయోగించింది. అయితే, భారత్ వీటిని ఆకాశంలోనే దెబ్బకొట్టాయి. వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీ మిలిటరీ పర్సన్స్ కూడా సాయం చేసినట్లు తెలుస్తోంది. భారత్ దాడిలో వీరిద్దరు మరణించినట్లు సమాచారం.