Kirana Hills: అణు సంక్షోభంలో పాకిస్తాన్..? కిరానా హిల్స్ లో ఏం జరిగింది..?

పాకిస్తాన్‌లోని (Pakistan) కిరానా హిల్స్ (Kirana Hills), సర్గోధా ప్రాంతంలోని ఒక రహస్య అణు స్థావరం (Nuclear Weapons) ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత్ (India) జరిపిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తర్వాత సోషల్ మీడియాలో ఈ ప్రాంతం గురించి పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో అణుధార్మిక లీక్ అయిందని, అమెరికా, ఈజిప్ట్ విమానాలు అత్యవసరంగా రంగంలోకి దిగాయని సంచలన ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనలూ పాకిస్తాన్ నుంచి ఇంతవరకూ లేవు. అయితే విమానాలు హడావుడిగా అక్కడికెళ్లడం, పాకిస్తాన్ కూడా అనూహ్య పరిణామాల మధ్య భారత్ తో కాల్పుల విరమణకు ముందుకు రావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.
మే 7న భారత వైమానిక దళం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్‌లు ఉపయోగించింది. కొందరు X పోస్ట్ ల ప్రకారం, ఈ దాడుల్లో కిరానా హిల్స్ లోని ఒక రహస్య అణు స్థావరం కూడా దెబ్బతినిందని సమాచారం. ఈ దాడి వల్ల అణు రియాక్టర్‌లో లీక్ జరిగి, రేడియేషన్ వ్యాప్తి చెందిందని కొన్ని పోస్ట్ లు బయటికొచ్చాయి. అయితే ఇందులో ఎంతమేర వాస్తవం ఉందో తెలీదు. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అయితే.. కిరానా హిల్స్ లో రేడియేషన్ లీక్ అయిందని.. అందుకే అమెరికాకు చెందిన B-350 AMS (Aerial Measuring System) విమానం రేడియేషన్ స్థాయిలను కొలిచేందుకు అత్యవసరంగా పాకిస్తాన్ వెళ్లిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అణు సంక్షోభాన్ని అంచనా వేయడానికే ఈ విమానం వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు చెప్తున్నాయి. అదే సమయంలో ఈజిప్ట్ నుంచి బోరాన్ (న్యూట్రాన్‌లను గ్రహించే రసాయనం) తీసుకుని మరో విమానం కిరానా హిల్స్ కు చేరుకుందని ఊహాగానాలు వచ్చాయి. ఈ రెండు విమానాల రావడం.. అక్కడ పాకిస్తాన్ అణు స్థావరానికి ముప్పు ఏర్పడిందనేందుకు సంకేతమని కొందరు వాదిస్తున్నారు. బహుశా పాకిస్తాన్ అణు స్థావరం అదుపు తప్పిందని.. అందుకే అమెరికా, ఈజిప్ట్ సహాయం కోరిందని చెప్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం 11 మంది సైనికులను కోల్పోయినట్లు ప్రకటించింది. 78 మంది గాయపడినట్లు తెలిపింది. మే 10న రెండు దేశాల DGMOల మధ్య చర్చల తర్వాత కాల్పుల విరమణ మొదలైంది. అయితే.. కిరానా హిల్స్ లో రేడియేషన్ లీక్ కావడం వల్ల ప్రజలు ప్రమాదంలో పడ్డారని, అందుకే పాకిస్తాన్ త్వరగా కాల్పుల విరమణకు అంగీకరించిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ లీక్ వల్ల సర్గోధా ప్రాంతంలో ఖాళీ చేయించిన గ్రామాలు, ఆసుపత్రుల్లో రద్దీ, రహస్యంగా జరిగిన అత్యవసర సమావేశాలు ఈ కథనానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
భారత్ రహస్యంగా కిరానా హిల్స్ పై దాడి చేసి, పాకిస్తాన్ అణు ఆయుధాలను నిర్వీర్యం చేసిందని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో జరిగిన ఈ దాడి అణు స్థావరంలో ఒక చిన్న పేలుడును సృష్టించి, రేడియేషన్ లీక్‌కు దారితీసిందని వారు ఊహిస్తున్నారు. దీన్ని దాచి పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించినా.. అమెరికా వంటి దేశాలు దీన్ని పసిగట్టాయని చెప్తున్నారు. అందుకే విధిలేక అమెరికా, ఈజిప్ట్ వంటి దేశాల సాయం కోరిందని సమాచారం.