Trump: చర్చల్లో పురోగతి లేదు..పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం..

అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన వార్ ముగిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా పుతిన్ ను యుద్ధవిరమణకు అంగీకరింపజేయడానికి తంటాలు పడుతున్నారు. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో అసహనం వ్యక్తంచేస్తోన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పరుష వ్యాఖ్యలు చేశారు (Trump-Putin). మాస్కోపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ‘‘పుతిన్ అంతే,. మనుషులను చంపుతూనే ఉండాలని కోరుకుంటున్నారు. అది ఏమాత్రం మంచిదికాదు’’ అని మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తంచేశారు (Trump-Putin).
అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10 గంటలకు ఉక్రెయిన్ యుద్ధం తదితర అశాలపై పుతిన్-ట్రంప్ సుమారు గంటసేపు చర్చలు జరిపారు. ఇంత చేసినా వారు ఏ నిర్ణయానికి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ఆ తర్వాత అంగీకరించారు. ‘‘మేము ఈ రోజు ఎటువంటి పురోగతి సాధించలేదు. ఫోన్‌కాల్‌లో సుదీర్ఘంగా మాట్లాడుకొన్నాం. ఇరాన్ విషయం సహా పలు అంశాలపై మాట్లాడుకొన్నాం. ఉక్రెయిన్ అంశం చర్చకు వచ్చింది. ఆ విషయంలో నేను ఏమాత్రం సంతృప్తిగా లేను. ఏమాత్రం పురోగతి సాధించలేదు’’ అని ట్రంప్ నిరాశ వ్యక్తంచేశారు.
ఆ అంశంపై పుతిన్ సహాయకుడు యూరీ ఉష్కోవ్ మాట్లాడుతూ ఇరువురు నాయకులు సూటిగా చర్చించుకొన్నారు. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్ సూచించినా.. పుతిన్ మాత్రం తిరస్కరించారు. ఈ యుద్ధానికి కారణమైన అంశాల్లో రష్యా లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పారు. అదే సమయంలో దౌత్య మార్గంలో అంతిమంగా పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యుద్ధ విరమణ కోసం ట్రంప్-పుతిన్ చర్చించుకోవడం ఇది ఆరోసారి. ఉక్రెయిన్‌పై కఠిన వైఖరితో వ్యవహరిస్తోన్న రష్యా.. అమెరికా అధ్యక్షుడితో సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా 13 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడులు జరిపింది.