Kathmandu: రామయ్య మావాడే.. శివుడు మావాడే.. భారతీయులపై నేపాల్ ప్రధాని ఓలి అక్కసు..

నేపాల్ (Nepal) ప్రధాని కేపీ శర్మ ఓలీ.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఈసారి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పడేశారు. ఈసారి ఆయన శ్రీరాముడి జన్మస్థలంపై పడ్డారు. రామచంద్రుడు పుట్టింది భారత దేశంలోని అయోధ్య (Ayodhya) లో కాదు. తమదేశంలో అంటూ పునరుద్ఘాటించారు.ఖాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వాదనను వినిపించారు.
తాను సొంతంగా ఈ మాటలు చెప్పడం లేదని, వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే ఈ విషయం చెబుతున్నానని కేపీ ఓలీ స్పష్టం చేశారు. రాముడు పుట్టిన నిజమైన ప్రదేశం నేపాల్‌లోనే ఉందని, ఈ నిజాన్ని ప్రచారం చేయడానికి ప్రజలు ఏమాత్రం వెనుకాడొద్దని ఆయన పిలుపునిచ్చారు.
2020లో కూడా ఓలీ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ దేశంలోని చిత్వాన్ జిల్లా థోరి ప్రాంతమే అసలైన అయోధ్య అని, అక్కడే రాముడు జన్మించారని అప్పట్లో పేర్కొన్నారు.
కేపీ శర్మ.. రాముడితో సరిపెట్టలేదు. హిందువుల ఆరాధ్యుడైన శివుడిని కూడా తమ దేశంలోనే ఉంచేసుకున్నారు. రాముడే కాకుండా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని ఓలీ తెలిపారు. ఇతిహాసాల్లో పేర్కొన్న పలు ప్రదేశాలు ప్రస్తుతం నేపాల్‌లోని సున్‌సారి జిల్లాలో ఉన్నాయని ఆయన అన్నారు.
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యలపై భారతీయులు మండిపడుతున్నారు. తమ ఆరాధ్యుడైన సీతారాముడిని.. నేపాల్ దేవుడిగా చూడాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడు అయోధ్యలో పుట్టినట్లు చాలా చారిత్రక ఆధారాలున్నాయని..వాటిని ముందు గమనించాలని కేపీ శర్మ ఓలీకి సూచిస్తున్నారు. మరికొందరేమో అసలు దేవుడికి …ప్రపంచమంతా ఆవాసమని.. దేశాలతో సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు.