Canada: కెనడాలో లిబరల్స్ విజయం.. భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

కెనడా ఎన్నికల్లో లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ (Mark Carney) మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)… కార్నీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా భారత్, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టపరమైన పాలన పట్ల దృఢమైన వైఖరి, నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని మోడీ అన్నారు. కెనడాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానకి, ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ఇటీవల కెనడాతో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు విధించారు. దీంతో అగ్రదేశంతో కెనడాకు విభేదాలు నెలకొన్నాయి. అంతే కాకుండా ఆ దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జస్టిన్ ట్రూడో (Justin Trudeau Resign)కు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు, పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ (Mark Carney) నియమితులయ్యారు. ట్రూడో భారత్‌కు వ్యతిరేకంగా వెళ్లినప్పటికీ కార్నీ అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్‌కు మద్దతుగానే ఉన్నారు. దీంతో కెనడా- భారత్ (India-Canada) మధ్య విచ్ఛిన్నమైన సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తామని అనేకసార్లు బహిరంగంగా ప్రకటించారు.
భారత్‌తో సంబంధాలు తెగిపోవడానికి కారణమైన విభేదాలను పరిష్కరించడానికి కృషి చేస్తామని కార్నీ పేర్కొన్నారు. కెనడియన్లు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్‌తో సంబంధాలు కలిగిఉంటారన్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునర్నిర్మితమవుతున్న సమయంలో భారత్, కెనడా వంటి దేశాలు భాగస్వామ్య ఆర్థికవ్యవస్థను నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. తాము అధికారం చేపట్టగానే న్యూఢిల్లీతోనే కాకుండా సారూప్యత కలిగిన దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. కెనడా, భారత్ మధ్య అధికారిక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామన్నారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఆ దేశంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
భారత్‌పై ట్రూడో అక్కసుతో విభేదాలు..
దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్, కెనడాల మధ్య 2013 నుంచి సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించడంతో.. భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. భారత నిఘా సంస్థలకు ఎటువంటి ఆధారాలు చూపకుండానే కెనడా సర్కారు నిందలు మోపింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి. అనంతరం కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ యత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు డిప్యూటీ డైరెక్టర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.