Kashmir: కశ్మీర్ ఉగ్రవాదులు కాదు.. స్వాతంత్రయోధులు.. తీరు మారని పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్

పాకిస్థాన్ (Pakistan) సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్ … నరనరాన భారత వ్యతిరేకత వంటపట్టించుకున్న వ్యక్తి. ఎందుకంటే.. ఇతని హయాంలోనే ఉరీ ఎటాక్.. పహల్గామ్ ఉగ్రదాడి సహా కీలక దాడులన్నీ జరిగాయి. అంతే కాదు.. ఈ సైన్యాధిపతి.. ఏకంగా ఉగ్రవాదులతోనే నిత్యం టచ్ లో ఉండే వ్యక్తి. అందుకే ఇటీవల ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు అంత్యక్రియల సమయంలో దర్శనమిచ్చారు. అదే సమయంలో ఉగ్రనేతలతో కలిసి ఉన్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అలాంటి వ్యక్తి .. మరి సైన్యాధిపతిగా ఉంటే ఊరుకుంటాడా .. ప్రశ్నే లేదు.. మళ్లీ తన పంథాను భారత్ కు చవిచూపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఇటీవలి కాలంలో వరుసగా భారత్ పై విషం కక్కుతున్న మునీర్.. లేటెస్టుగా మరోసారి అదే వాణి వినిపించారు.. కశ్మీరీ ఉగ్రవాదులను పూర్తిగా వెనకేసుకొచ్చారు. వారిని స్వాతంత్య్ర యోధులుగా అభివర్ణించారు. వారిది చట్టబద్ధమైన పోరాటమని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు. వారి పోరాటాన్ని అంతర్జాతీయ చట్టాలూ గుర్తించాయని అన్నారు.వారికి తమ దేశం పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్నారు.
‘‘భారత్ ఉగ్రవాదంగా ముద్ర వేస్తున్నది వాస్తవానికి అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన చట్టబద్ధమైన, న్యాయసమ్మతమైన పోరాటం’’ అని మునీర్ పేర్కొన్నారు. ఆయన కరాచీలో పాకిస్థాన్ నావల్ అకాడమీలో మాట్లాడారు. కశ్మీర్ (Kashmir) కు రాజకీయ, దౌత్య, నైతికపరమైన మద్దతును తమ దేశం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. స్వయం నిర్ణయాధికారం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని అన్నారు.
‘‘ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కనుక్కోవాలని పాకిస్థాన్ బలంగా నమ్ముతోంది’’ అని తెలిపారు మునీర్. భారత్ ఎంతగా కవ్విస్తున్నా పాకిస్థాన్ సంయమనం పాటిస్తోందని, ఈ ప్రాంత శాంతి, సుస్థిరతలను దృష్టిలో ఉంచుకొని చాలా వివేకంతో వ్యవహరిస్తోందని అన్నారు. పాకిస్థాన్‌పై మళ్లీ దాడి చేసే దుస్సాహసానికి భారత్ పాల్పడితే దీటైన సమాధానం ఇస్తామని మునీర్ హెచ్చరించారు.