Trump: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి.. ఫలించిన అమెరికా హెచ్చరికలు ?

రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) అధికారికంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతి దాడుల హెచ్చరికలు చేసింది. అంతేకాదు.. ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్ హెచ్చరికలతో అవి వెనక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టంచేసింది. మరోవైపు కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. సౌదీ అరేబియా, ఈజిప్టు కూడా స్వాగతించాయి.
ముగిసిన 12 రోజుల యుద్ధం
ట్రంప్ ప్రకటన అనంతరం.. కాల్పుల విరమణను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అటు యుద్ధాన్ని ఆపేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ‘కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దానిని దయచేసి ఉల్లంఘించకండి’ అంటూ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. ఆ వెంటనే ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ఉల్లంఘన జరిగితే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని యుద్ధ లక్ష్యాలను సాధించిందని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి తెలిపారు.
శనివారం తాము జరిపిన దాడులు ఇజ్రాయెల్‌కు ఉపయోగపడ్డాయని, దీంతో ఆ దేశం కాల్పుల విరమణకు అంగీకరించిందని శ్వేతసౌధం ప్రకటించింది. ఖతార్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిందని వివరించింది.కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన, దానిని ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్ ఆరోపణలపై ఇరాన్ స్పందించలేదు. చర్చల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భాగమయ్యరా లేదా అనేది తెలియలేదు. అయితే అంతకుముందే దాడులను నిలిపేసేందుకు సిద్ధమవుతున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఇరాన్ కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అమల్లోకి తీసుకొచ్చిందని వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్, ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని విమర్శించారు. ‘ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి’ అని ఇజ్రాయెల్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల జోలికి వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరించారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతను చాటుకున్నామని తెలిపారు.
ఖతార్, ఇరాక్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి తెలిపారు. ఇలా ప్రపంచంలోని ఏ దేశమూ అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసే ధైర్యం చేయలేదని, తాము చేశామని పేర్కొన్నారు. అమెరికా ఇంకోసారి ఇరాన్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. ప్రతి దాడి చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఇరు దేశాలకూ భారీ నష్టమే..
12 రోజులపాటు జరిగిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో రెండు దేశాలకూ భారీ నష్టం జరిగింది. ఇరాన్ దాడిలో 24 మంది ఇజ్రాయెలీలు మరణించగా.. 1,000 మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 974 మంది ఇరానియన్లు మరణించగా.. 3,458 మంది గాయపడ్డారు.
విరమణ కొనసాగుతుందని ఆశిస్తున్నాం: రష్యా
కాల్పుల విరమణను రష్యా స్వాగతించింది. ఇది సుస్థిరంగా కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తాము తొలి నుంచీ శాంతినే కోరుకుంటున్నామని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.