America: పాలు పోసిన పామే కాటేస్తుందని అమెరికా భయమా..?

ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాలు ఏమో గాని అమెరికాకు మాత్రం కంటి మీద కునుకు లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ఇరాన్ ను కట్టడి చేయడానికి ఇజ్రాయిల్ ద్వారా భయపెట్టాలని ప్రయత్నాలు చేసిన అమెరికా.. ఇప్పుడు ఇరాన్ దెబ్బకు భయపడి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించింది. ఇరాన్ నుంచి ఆ స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఏ కోణంలో కూడా ఊహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. ఇరాన్ దెబ్బకు ఇజ్రాయిల్ తట్టుకోలేకపోవడంతో ఇబ్బంది పడ్డారు.
అయితే ఇక్కడ చరిత్ర మాత్రం ఇరాన్(Iran) విషయంలో అమెరికా చేసిన తప్పును స్పష్టంగా బయటపెడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డ్వైట్ డి ఐసెన్‌హోవర్ ఉన్నప్పుడు.. అంటే 1960 ల రోజుల్లో సోవియట్ యూనియన్ కు ఇరాన్ సహకరించకుండా ఉండేందుకు.. అణ్వాయుధాల విషయంలో నిపుణులుగా ఉన్న సంస్థలతో ఇరాన్ లోని శాస్త్రవేత్తలకు శిక్షణ ఇప్పించారు. షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలనలో ఉన్న ఇరాన్ ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించింది. అమెరికాతో భవిష్యత్తులో అవసరాలు ఉంటాయని భావించి స్నేహం చేసింది.
ఇరాన్ లో అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం అమెరికా సంస్థలే. కాల క్రమంగా ఆ సంస్థలను ఇరాన్ నుంచి తరిమేశారు. అదే సమయంలో చైనాతో చేసుకున్న కొన్ని వ్యాపార ఒప్పందాలు ఇరాన్ కు కలిసి వచ్చాయి. దీనితో ఇరాన్ సొంతగా.. తన పరిజ్ఞానంతో అణు ఆయుధాలను తయారు చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కథ మారడంతో అమెరికా.. మధ్య ప్రాచ్యంలో శక్తివంతమైన రాజ్యంగా ఉన్న ఇరాన్ ను దారిలోకి తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.
కాని ఇరాన్ మాత్రం దశాబ్దాలుగా రష్యాతో కూడా స్నేహం షురూ చేయడం అమెరికాకు మింగుడు పడలేదు. అందుకే సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయిల్ ను ఇరాన్ పై రెచ్చగొట్టింది. దాడులు చేస్తే ఇరాన్ దారిలోకి వస్తుందని భావించినా, అణు క్షేత్రాల విషయంలో అమెరికా దాడులు చేస్తే వెంటనే ఖతార్ ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడులు చేయడాన్ని అమెరికా ఊహించలేదు. క్రమంగా ఇరాన్ కు మద్దతు పెరగడం, పాకిస్తాన్(Pakistan) లోని ప్రజలు కూడా ఇరాన్ కు మద్దతుగా నిలబడటం, ఇరాన్ కు బలమైన ఆయుధ శక్తి ఉండటం, తమ దేశం గుండా వెళ్తున్న హమ్రూజ్ జల సంధిని ఇరాన్ మూసి వేసే అవకాశం ఉండటంతో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. మరి భవిష్యత్తులో ఇరాన్ విషయంలో అమెరికా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.