Iran: అణ్వాయుధాలు మా లక్ష్యం కాదు.. శాంతియుత ప్రయోజనాల కోసమే అన్న ఇరాన్..

ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పశ్చిమాసియా శాంతించింది. ఈ క్రమంలో ఇరాన్ (Iran) అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు తయారుచేయాలనేది తమ లక్ష్యం కాదన్నారు. అయితే, శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తి ఉపయోగించుకునే చట్టబద్ధమైన హక్కులను కాపాడుకుంటామని వెల్లడించారు.
కాల్పల విరమణ ఒప్పందం అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో పెజిష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు. ‘ఇరాన్ తన చట్టబద్ధమైన హక్కులకు కట్టుబడి ఉంది. మా దేశం ఎప్పుడూ అణ్వాయుధాలను సంపాదించడానికి ప్రయత్నించలేదు. అది కోరుకోము కూడా. ఇరాన్ ఎలాంటి సంఘర్షణలు కోరుకోవడం లేదు. అయితే, మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేము. చర్చలతో అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పెజిష్కియాన్ తెలిపారు.
గత 12 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనితర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్ మీడియా పేర్కొంది. అటు నెతన్యాహు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
కానీ.. ఈపరిణామాలను ఇరాన్ అంత తేలిగ్గా మర్చిపోతుందా..? తనపై దాడి చేసి, అణ్వాయుధ స్థావరాలను ధ్వంసం చేసిన అమెరికా, ఇజ్రాయెల్ తీరును నమ్మగలుగుతుందా..? ఇంత జరిగిన తర్వాత పశ్చిమాసియాలో ఇతర గల్ఫ్ దేశాలను ఇరాన్ నమ్మే అవకాశముందా..? అంటే.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడీ అంశానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.