Tehran: అతిపెద్ద మానవ సంక్షోభం ముంగిట ఆఫ్గనిస్తాన్…

ఆఫ్గనిస్తాన్ ను పొరుగున ఉన్న పాకిస్తాన్(Pakistan), ఇరాన్ టార్గెట్ చేశాయా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానీయులపై పాకిస్థాన్ (Pakistan) చర్యలు తీసుకుంటుండగా.. ఇరాన్ (Iran) సైతం కొరడా ఝళిపిస్తోంది. జులై 6లోగా స్వదేశానికి వెళ్లిపోవాలన్న టెహ్రాన్ ఆదేశాలతో.. లక్షలాది మంది అఫ్గానీయులు మాతృభూమి బాటపట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.91 లక్షల మంది వెనక్కి వెళ్లినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) తెలిపింది. ఒక్క జూన్‌లోనే 28వ తేదీనాటికి 2.30 లక్షల మంది ఇరాన్‌ను వీడినట్లు వెల్లడించింది.
టెహ్రాన్ విధించిన డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో ఇటీవలి కాలంలో పెద్దసంఖ్యలో అఫ్గానీయులు స్వదేశానికి చేరుకుంటున్నట్లు ఐవోఎం ప్రతినిధి తెలిపారు. ‘‘జూన్ 21-28 మధ్యకాలంలో 1.31 లక్షల మంది తరలివెళ్లారు. ఆ వారం చివర్లో రోజూ 30 వేలమందికిపైగా సరిహద్దు దాటారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.91 లక్షల మందిని ఇరాన్ సాగనంపగా.. వారిలో 70 శాతానికిపైగా బహిష్కరణకు గురైనవారే’’ అని వెల్లడించారు.
‘‘ప్రాంతీయ అస్థిరత, ఇజ్రాయెల్- ఇరాన్ వివాదం పరిణామాలు, టెహ్రాన్ విధానాల్లో మార్పుల వంటివి ఇటీవల కాలంలో పెద్దఎత్తున అఫ్గానీయుల బహిష్కరణకు కారణమయ్యాయి’’ అని అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే దుర్బల స్థితిలో ఉన్న అఫ్గాన్ మానవతా, అభివృద్ధి కార్యక్రమాలపై ఇది ప్రభావం చూపుతోందని తెలిపింది. మరోవైపు.. నిధుల కోత కారణంగా శరణార్థులకు సాయం అందించలేని పరిస్థితి ఉందని ఐవోఎం చెప్పింది. మరోవైపు.. పాకిస్థాన్ సైతం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ వరకు దాదాపు 5 లక్షల మందిని సాగనంపింది.
అసలే ఆఫ్గనిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల నుంచి ఆఫ్గన్ పౌరులను లక్షల సంఖ్యలో తిరిగి పంపిస్తుండడంతో.. దాన్ని తట్టుకుని, భరించే స్థాయిలో కాబూల్ లేదని చెప్పొచ్చు. ఫలితంగా ఇది దారుణమైన మానవ సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని తెలుస్తోంది. మరి దీన్ని ఆఫ్గనీ సర్కార్ ఎలా పరిష్కరించనుంది..? దీనికి మిత్రదేశాలు సహకరిస్తాయా అన్నది అస్పష్టంగా కనిపిస్తోంది.