USA: ఇరాన్ అణుకేంద్రాలపై దాడుల ప్రభావం తీవ్రమే… అయితే త్వరలోనే కోలుకుంటుందన్న ఐఏఈఏ

ఇరాన్ (Iran) అణుకేంద్రాల్ని ధ్వంసం చేశాం…క్లస్టర్ బాంబులతో మొత్తం నాశనమైంది.. ఇదీ కొద్దిరోజులుగా ట్రంప్ (Trump) సర్కార్ ఘనంగా చెబుతున్న మాటలివి. అయితే ..ఇది అమెరికా చెబుతున్నంతగా నష్టం కలగలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధిపతి రఫేల్ గ్రాసీ వెల్లడించారు. అమెరికా దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందన్నారు.టెహ్రాన్ మరికొన్ని నెలల్లోనే అణు ఇంధనం శుద్ధి చేయడాన్ని ప్రారంభించగలదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దాడి అనంతరం వెలువడిన పెంటగాన్ ఇంటెలిజెన్స్ నివేదికలో ఇచ్చిన సమాచారానికి మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి.
‘‘నిజం చెప్పాలంటే.. అంతా మాయమైపోయిందని, అక్కడేమీ మిగల్లేదని ఎవరూ చెప్పలేరు. అమెరికా రెండు అణుకేంద్రాలపై 14 బంకర్ బస్టర్ బాంబులు వేసింది. తీవ్రంగా నష్టం వాటిల్లింది. కానీ, పూర్తిగా నాశనమైపోలేదు’’ అని రాఫేల్ గ్రాసీ పేర్కొన్నారు. ఆ రెండు కేంద్రాల్లో 18,000 సెంట్రిఫ్యూజ్‌లు ఉండొచ్చని గతంలో ఆయన అంచనా వేశారు.
వాస్తవానికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్టు పూర్తిగా బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించిన యురేనియం శుద్ధి కేంద్రాల పైనే ఉంది. కానీ, ఇతర గ్రూపుల నుంచి వచ్చిన విశ్లేషణల ప్రకారం ఇరాన్‌కు అతిపెద్ద దెబ్బ ఇస్ఫహాన్‌లో తగిలింది. ఇక్కడ శుద్ధి చేసిన యురేనియంను లోహంగా మార్చేందుకు అవసరమైన ల్యాబ్ అమెరికా దాడిలో ధ్వంసమైంది. ఇది మాత్రం టెహ్రాన్‌కు ఇబ్బందికర విషయమే. అణ్వాయుధం తయారీకి ఈ ప్రక్రియ చాలా కీలకం.
మరోవైపు ఇరాన్ ఉన్నతాధికారుల సంభాషణలను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టి విశ్లేషించాయి. వారు ఊహించినంత నష్టం వాటిల్లలేదని దీనిని బట్టి తెలుస్తోంది. ట్రంప్ మాత్రం ఇంటెలిజెన్స్ నివేదికలు లీక్ చేసిన సీఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్‌ను కోర్టుకు లాగాలని నిర్ణయించుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తాము చట్ట ప్రకారం వెళ్లి.. ‘‘జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎవరు ఇచ్చారో వెల్లడించాలి’’ అని కోరతామన్నారు. మరోవైపు ఇరాన్ దౌత్యవేత్త అమిర్ సయిదీ ఇరావని కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యురేనియం శుద్ధి ప్రక్రియ ఎప్పటికీ ఆగదని తేల్చిచెప్పారు. శాంతియుత అణు కార్యక్రమం కోసం ఇలా చేసే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు.