Pakistan: పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ.. అందుకే దిగివచ్చిందా..?

మే 7న భారత సైన్యం (India) పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఒక చారిత్రాత్మక సైనిక చర్యగా నిలిచింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam Terror Attack) జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని, సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కాక, పాకిస్తాన్ (Pakistan) సైనిక సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగించింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత నిఘా సంస్థలు ఈ దాడి వెనుక జైష్-ఎ-మహమ్మద్ (JeM), లష్కర్-ఎ-తయ్యిబా (LeT) వంటి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని గుర్తించాయి. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం (IAF) మే 7 అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర స్వదేశీ ఆయుధాలను ఉపయోగించి 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ను పూర్తి చేసింది. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, అనేక మంది ఉన్నత స్థాయి ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఆపరేషన్ సిందూర్ ఫలితంగా పాకిస్తాన్ సైనిక సౌకర్యాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన (PAF) 20శాతం మౌలిక సదుపాయాలను భారత్ ధ్వంసం చేసిందని అంచనా. సర్గోధాలోని ముషాఫ్ ఎయిర్‌బేస్, రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, భోలారీ, జాకోబాబాద్, సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్ వంటి అనేక ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిగాయి. ఈ దాడులలో రన్‌వేలు, హ్యాంగర్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. అనేక F-16, JF-17 ఫైటర్ జెట్‌లు నాశనమయ్యాయి. భోలారీ ఎయిర్‌బేస్‌లో జరిగిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ సహా 50 మందికి పైగా పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించారు. శాటిలైట్ చిత్రాలు ఈ దాడుల విధ్వంసకర ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. సర్గోధా ఎయిర్‌బేస్‌లో రన్‌వేలపై పెద్ద గుండ్లు, జాకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్లు ధ్వంసమైనట్లు చూపించాయి. చైనా సరఫరా చేసిన రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ఈ దాడులలో నాశనమయ్యాయి. ఇది భారత్ ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి భారీ ఆర్టిలరీ షెల్లింగ్ చేపట్టింది. ఈ దాడుల్లో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో 12 మంది పౌరులు, ఒక సైనికుడు మరణించారు. అయితే పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడులను భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు విజయవంతంగా నిరోధించాయి. భారత సైన్యం పాకిస్తాన్ సైనిక స్థానాలు, ఉగ్రవాద బంకర్లను కూడా ధ్వంసం చేసింది. దీనివల్ల 35-40 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, చైనా సహా ఆరు దేశాల నుంచి భారత్‌పై సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడులు రక్షణ PSUలు, కీలక మౌలిక సదుపాయాలు, ఆర్థిక వేదికలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే భారత సైబర్ రక్షణ వ్యవస్థలు ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయి.
ఆపరేషన్ సిందూర్ భారత సైనిక, సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. పాకిస్తాన్ వైమానిక దళ సౌకర్యాలకు 20శాతం నష్టం, 50 మందికి పైగా సైనిక మరణాలు, 100 మంది ఉగ్రవాదుల హతం ఈ ఆపరేషన్ తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ చర్య భారత జీరో టాలరెన్స్ విధానాన్ని బలపరిచింది. భారత్ ఇదే దూకుడుతో వ్యవహరిస్తే మొదటికే ముప్పు వస్తుందని భావించిన పాకిస్తాన్.. వెంటనే కాళ్లబేరానికి వచ్చినట్లు సమాచారం.