China: పేర్లు మారిస్తే వాస్తవాలు మారతాయా…? చైనా కుటిలనీతిపై భారత్ ఆగ్రహం

అరుణాచల్‌ప్రదేశ్ (Arunachal Pradesh) లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ (Ministry of External Affairs) స్పందించింది. చైనా (China) వక్రబుద్ధిపై మండిపడింది. ఆ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
‘‘భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal ) స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని తెలిపారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని.. అది విడదీయరాని భాగమని.. పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని’’ రణ్‌ధీర్‌జైస్వాల్ మండిపడ్డారు.
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటెన్ పేర్లను పెట్టింది. అరుణాచల్‌పై ఇలాంటి చైనా కుట్రలను భారత్ పదే పదే ఎండగడుతోంది. బీజింగ్ గతంలో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.
చైనా ఓ పద్ధతి ప్రకారం సరిహద్దుల్లో గ్రామాలు నిర్మిస్తోంది.వాటిని కాలనీలుగా మార్చేస్తోంది. అక్కడికి ప్రజలను తరలిస్తోంది. నెమ్మదిగా ఆప్రాంతాలు.. తమదేశ భూభాగాలుగా మ్యాపుల్లో చూపిస్తోంది. తర్వాత అక్కడి నుంచి మరింత ముందుకు చొచ్చుకు వస్తోంది. ఇది ఒక్క భారత భూభాగం అనే కాదు.. పక్కనే ఉన్న భూటాన్, నేపాల్, ఇతర సరిహద్దు దేశాలకు కూడా తెలుసు. కానీ చైనా బలానికి భయపడి.. చిన్న దేశాలు నోరు మెదపలేకపోతున్నాయి. భారత్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది.