Indo – Pak War: డ్రోన్లు, మిసైళ్లతో తెగబడుతున్న పాక్.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్..!!

భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. పాకిస్థాన్ (Pakistan) సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక అత్యవసర పత్రికా సమావేశంలో భారత్ (India) తమ దేశంలోని మూడు కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ఈ దాడుల్లో రావల్పిండిలోని (Ravalpindi) నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్, జంగ్ జిల్లాలోని షోర్కోట్‌లో ఉన్న రఫీఖీ ఎయిర్‌బేస్‌లు ఉన్నాయని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. ఈ దాడులు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌ల ద్వారా జరిగినట్లు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, ఇస్లామాబాద్‌కు (Islamabad) సమీపంలో రావల్పిండిలో ఉంది. ఇది పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న ఒక సున్నితమైన స్థావరం. ఈ స్థావరం సమీపంలో రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో రావల్పిండిలోని ప్రజలు బెంబేలెత్తిపోయారు. రావల్పిండిలో వరుసగా ఐదు చోట్ల పేలుళ్లు సంభవించినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి. మురిద్ ఎయిర్‌బేస్ డ్రోన్ యుద్ధ సామర్థ్యాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ షాపర్-1, బైరక్తర్ టీబీ2 వంటి అధునాతన డ్రోన్‌లు ఉన్నాయని సమాచారం. రఫీఖీ ఎయిర్‌బేస్ మిరాజ్-III యుద్ధ విమానాలకు నిలయంగా ఉంది.
ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. లాహోర్‌లో (Lahore) ఆరు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు (Drone Attacks) జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పెషావర్‌లో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి, దీంతో యుద్ధం విస్తరించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీలం లోయ, సియాల్‌కోట్ ప్రాంతాల్లో కూడా భారత్ దాడులు చేసినట్లు పాక్ ఆరోపించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తన ఎయిర్‌స్పేస్‌ను అన్ని రకాల విమానాల కోసం మూసివేసింది. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (PAA) ఉదయం 3:15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్‌స్పేస్ మూసివేస్తూ NOTAM జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం PIA218 క్వెట్టా పైన గాలిలో తిరగాల్సి వచ్చింది. భారత్ కూడా ఉత్తర, పశ్చిమ భారతంలోని 32 విమానాశ్రయాలను మే 15 వరకు మూసివేసింది.
భారత దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ‘ఆపరేషన్ బున్యాన్ మర్సూస్’ పేరుతో ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. భారత్‌లోని పలు సైనిక స్థావరాలు, క్షిపణి నిల్వ స్థలాలను లక్ష్యంగా చేసుకుని ఫతేహ్ క్షిపణులను ప్రయోగించినట్లు పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో భారత్‌లోని పఠాన్‌కోట్, ఉధంపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. అయితే, భారత్ తమ వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, పాక్ దాడులను తిప్పికొట్టినట్లు పేర్కొంది.
భారత్ – పాకిస్తాన్ మధ్య మూడు రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ 26 ప్రాంతాలను డ్రోన్‌లతో లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని భారత్ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత్, ‘ఆపరేషన్ సిందూర్’ కింద పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో పాక్ రగిలిపోతోంది. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరుతోంది.