Pakistan: ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాక్ ప్రయత్నాలు.. !

పాకిస్తాన్ (Pakistan) పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎంత దయనీయంగా అంటే .. అసలేం చెప్పాలో అర్థం కానంత.. ఎందుకంటే పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమని ప్రపంచమంతా నమ్ముతోంది. ఇక న్యూస్ చానెల్స్ అయితే.. ఈ విషయాన్ని స్వయంగా ప్రచారం చేస్తున్న సందర్భాలున్నాయి. అలాంటిది పాకిస్తాన్ నేతలు మాత్రం.. తమది ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి వికటించి ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్నారు.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఓ టీవీ షో వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాదిని ‘సాధారణ వ్యక్తి’ అంటూ వెనకేసుకొచ్చారు. తీరా ఆ కెమెరా ఎదుటే ఫ్యాక్ట్ చెక్ చేయడంతో.. ఆమె పరువు పోయింది. ఇటీవల హీనా రబ్బానీ అల్ జజీరా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వం వహించాడు. అతడిని అమెరికా అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది. కానీ, హీనా రబ్బానీ మాత్రం ఈ అంశంపై మాట్లాడుతూ ‘‘మీరు ఉగ్రవాది అంటూ ఆధారాల్లో చూపెడుతున్న వ్యక్తి.. మీరు అనుకొంటున్న ఉగ్రవాది కాదు. పాకిస్థాన్‌లో లక్షల మంది అబ్దుల్ రవూఫ్‌లు ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టు స్పందిస్తూ.. అంత్యక్రియల సందర్భంగా విడుదల చేసిన ఫోటో ఫేక్ అని చెప్పలేదని గుర్తుచేశారు. అంతేకాదు.. ఆ వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి చెందినవాడని.. అతడి నేషనల్ ఐడీ నెంబర్‌ను కూడా విడుదల చేశారని గుర్తుచేశారు. ఆ నేషనల్ ఐడీ.. అమెరికా ఉగ్ర జాబితాలో వెల్లడించిన ఐడీ ఒకటే అని సదరు జర్నలిస్టు హీనాకు వివరించారు.
ఈ పరిణామాలతో అవాక్కైన పాక్ నేత సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నించారు. పాక్ సైన్యం అంత్యక్రియలకు వచ్చిన రవూఫ్‌ను వెనకేసుకొచ్చింది. కానీ.. అమెరికా ఆంక్షల జాబితాలోని వ్యక్తి అతను కాదని బుకాయించారు. దీంతో ఆ వ్యక్తి నేషనల్ ఐడీ నెంబర్, అమెరికా ప్రకటించిన ఉగ్రవాది నెంబర్ ఒకటే అన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. పాక్ ఐఎస్‌ఐ ప్రజాసంబంధాల విభాగం మాత్రం భారత్ చెబుతున్న రవూఫ్ అతడు కాదన్న విషయాన్ని వెల్లడించిందని హీనా తెలిపారు.
పాకిస్థాన్‌లోని మురీద్కేలోని లష్కరే శిబిరంపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నిర్వహించిన అంత్యక్రియల్లో అబ్దుల్ రవూఫ్ పాల్గొన్నాడు. ఈ ఫొటో వైరల్ కాగానే పాక్ సైన్యానికి చెందిన ఐఎస్‌పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ స్పందించారు. ఫొటోలోని వ్యక్తి అబ్దుర్ రవూఫ్ కాదని.. పాక్ రాజకీయ పార్టీ నేత అని వెల్లడించారు.