White House: నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్.. అమెరికా అధ్యక్షుడిలో మళ్లీ చిగురించిన ఆశలు

నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. ఆదిశగా తొలి అడుగు వేశారు. ఇజ్రాయెల్-ఇరాన్(Iran) మధ్య యుద్దాన్ని ఆపానని ట్రంప్ స్వయంగా చెప్పుకున్నారు కూడా. గతంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య సిందూర్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ క్రెడిట్ తీసుకోగా.. భారత్ కాదని స్పష్టం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే విషయాన్ని.. పరోక్షంగా వెల్లడించింది. దీంతో ట్రంప్ ఆశలు ఆకాంక్షలు నీరుగారిపోయాయి. ఎంతగా అంటే.. నాకు నోబెల్ బహుమతి ఇక రాదేమో అన్నంతగా ట్రంప్ ఆవేదన చెందారు.
అయితే.. ఇప్పుడు ట్రంప్ కు కాలం కలిసివస్తోంది. ఆయన సహకారంతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్.. ట్రంప్ మాటలతో శాంతించింది. తాను పంపిన యుద్ధ విమానాలను సైతం వెనక్కు రప్పించింది. మరోవైపు.. ఇరాన్ సైతం ఏమీ అనకుండా ఆగిపోయింది. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి కూడా. దీంతో తాను ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ .. ఘనంగా చెప్పుకుంటున్నారు కూడా.
ట్రంప్ పేరును అధికారికంగా నోబెల్ కమిటీకి నామినేట్ చేశారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్ ఈ మేరకు నార్వేలోని నోబెల్ కమిటీకి ఓ లేఖను పంపించారు. ‘‘అసాధ్యమనుకొన్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్రాత్మక పాత్ర పోషించారు. దీంతోపాటు ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారు. ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్‌తో గుర్తించాలి’’ అని కోరారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతూ ఆయన ఒప్పందం కుదిర్చారు.
తమ ప్రతిపాదన విరమించుకొన్న ఉక్రెయిన్ సభ్యుడు..
ట్రంప్ పేరును ఉక్రెయిన్(Ukraine)కు చెందిన చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెఝాకో కూడా నోబెల్‌కు ప్రతిపాదించారు. కానీ, అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో విఫలం కావడంతో ఇప్పుడు తాజాగా ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించారు. తనకు ట్రంప్‌పై నమ్మకం పోయిందని ఆయన ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల వేళ ట్రంప్ హామీ ఇచ్చారు. ఆయన ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించినా.. రష్యా ఒప్పుకోలేదు.
ఇటీవల ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసింది. ఆ మర్నాడే ఆయన ఇరాన్‌పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేయించారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా పాక్ షాక్‌కు గురైంది. తమ పొరుగుదేశం పైనే ట్రంప్ విరుచుకుపడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి పాక్ ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. నోబెల్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇక భారత్ కూడా పాక్‌తో ఘర్షణను ట్రంప్ ఆపలేదని పలుమార్లు తేల్చిచెప్పింది.