Bejing: దలైలామా వారసుడి విషయంలో జోక్యం వద్దు.. అమెరికా, భారత్ లకు చైనా హెచ్చరిక

దలైలామా (Dalai Lama) వారసుడి విషయంపై ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం తమకు ఇష్టం లేదని తేల్చి చెబుతోంది చైనా. అది తమ అంతర్గత విషయంగా వాదిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల టిబెట్ విషయంలో అమెరికా (USA) జోక్యం చేసుకోవడాన్ని చైనా (China) తప్పుబట్టింది. ప్రస్తుత దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూబియో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజింగ్ ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
దలైలామాకు రూబియో శుభాకాంక్షలు తెలిపారు. టిబెట్‌కు నాయకుడిగా ప్రపంచంలో ఐక్యత, శాంతి, కరుణను ప్రచారం చేస్తున్నందుకు ప్రశంసించారు. ఈ సందర్భంగా టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ, మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు వారికి ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘దలైలామా మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు టిబెట్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే, ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం తగదు. ఇది ఒక సున్నితమైన అంశమని యూఎస్ గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా అమెరికా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
భవిష్యత్తులో తన వారసత్వం కొనసాగుతుందని ఇటీవల దలైలామా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు మాత్రమే వారసుడిని గుర్తిస్తుందని, మరెవరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు. టిబెట్‌పై పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని తీసుకోవాలని చైనా భావిస్తోంది. ఈ క్రమంలో దలైలామా ప్రకటనపై బీజింగ్ అభ్యంతరం తెలిపింది. వారసుడి ఎంపికకు తమ ఆమోదముద్ర ఉండాల్సిందేనని డిమాండ్ చేసింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దలైలామా అంశంలో జోక్యం చేసుకోవడం తగదంటూ భారత్‌పై చైనా వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే మత విశ్వాసాలు, ఆచారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదని భారత్ స్పష్టం చేసింది.