Canada: వలసదారులకు కెనడా మరో షాక్..

కెనడా వీసా (Canada) కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి అక్కడి ప్రభుత్వం సరికొత్త నిబంధనలు తెచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి (Fall 2025) దరఖాస్తు చేసుకునే వారికి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. క్యూబెక్ మినహా అన్ని రాష్ట్రాలకు వచ్చే వారు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అసలు ఇంతకు ఈ కొత్త అప్‌డేట్ ఏమిటంటే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయం (Cost of Living) కోసం అవసరమైన నిధుల మొత్తాన్ని దాదాపు 11% పెంచారు. దీంతో కనీస నిధుల మొత్తం 22.89వేల కెనడియన్ డాలర్లకు చేరుకుంది.
కెనడాలో ఉన్నత చదువుల (Study in Canada) కోసం వెళ్లే విదేశీ విద్యార్థులు ఏడాది పాటు ఆర్థిక అవసరాలకు సరిపడా నిధులు తమ దగ్గర ఉన్నట్లు ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ పరిమితి (ట్యూషన్ ఫీజు, ట్రావెల్ ఖర్చులు కాకుండా) ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి ఏడాదికి 20,635 డాలర్లు (కెనడియన్ డాలర్లు)గా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 22,895 డాలర్లకు పెంచింది.
భారత కరెన్సీ ప్రకారం.. కనీస నిల్వ ఇప్పటివరకు సుమారు రూ.13లక్షలుగా ఉండగా అది రూ.14.38లక్షలకు పెరగనుంది. కుటుంబంతో వచ్చేవారికి ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి అదనంగా 5599 డాలర్లు కనీస నిల్వ ఉండాల్సి ఉండగా.. దానిని 6170కి పెంచింది. అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటే 28,502 డాలర్లు, ముగ్గురు ఉన్నట్లయితే 35,040 డాలర్ల కనీస నిల్వలు ఉండాల్సిందే. కెనడా స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ట్యూషన్ ఫీజు, ట్రావెల్ ఖర్చులకు అదనంగా.. నివాసం, ఆహారం, రవాణా వంటి అవసరాల కోసం సరిపడా నిధులు తమ ఖాతాల్లో ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది.