Pakistan: నాలుకా.. తాటిమట్టా.. మసూద్ అజర్ మాదగ్గర లేడంటున్న పాక్…

అబద్దం ముందు పుట్టి పాకిస్తాన్ తర్వాత పుట్టినట్లుంది. ప్రతీ విషయంలోనూ అబద్దాలు వల్లె వేయడం అక్కడి నాయకులు, ఆర్మీ కమాండర్లకు అలవాటైనట్లుంది. ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ను.. ఉగ్రవాద కేంద్రంగా భావిస్తుంటే.. దాన్ని చెరిపివేసేందుకు మరోసారి తమకు అలవాటైన అబద్దాల మంత్రాలను పాక్ ఎంచుకుంది. దాన్నే మరోసారి వల్లెవేసి, బయటపడాలని చూస్తోంది.
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఆచూకి ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది. తాజాగా పాకిస్థాన్(Pakistan) పీపుల్స్ పార్టీ (PPP) నేత బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్ నిరూపిస్తే.. అతడిని మేము అరెస్టు చేయడాన్ని ఆనందంగా భావిస్తామని అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉండగా.. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన మసూద్ అజర్(Masood Azhar Global Terrorist)కు దేశంలో జరిగిన పలు భారీ ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 26/11 ముంబయి దాడులు, 2016 పటాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, అలాగే 2019లో పుల్వామా ఉగ్రదాడితో కూడా అతడికి సంబంధాలు ఉన్నాయి.
అంతేకాదు 2019లో అతడిని ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే 1999లో కాందహర్ ఫ్లైట్‌ను ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు.. బందీలను విడిపించేందుకు భారత కస్టడీలో ఉన్న మసూద్ అజర్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో భారత ప్రభుత్వం అతడిని నుంచి విడుదల చేసింది. ఆ తర్వాత అతడి ఆచూకి గురించి ఎవరికీ తెలియలేదు. చాలామంది పాకిస్థాన్‌లో ఉండి ఉంటాడని భావిస్తున్నారు. కానీ పాక్ మాత్రం అతడు అఫ్గానిస్థాన్‌లో ఉన్నట్లు భావిస్తోందని బిలావల్ బుట్టో చెబుతున్నారు.