BLA: పాక్ ఓ ఊసరవెల్లి… భారత్ జాగ్రత్తంటున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ…

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మరో అడుగు ముందుకు వేసే క్రమంలో ఇరు దేశాలు కమాండర్ల స్థాయిలో శాంతిచర్చలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దని వ్యాఖ్యలు చేసింది. ‘‘పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసం. అవి ఒక యుద్ధ వ్యూహం.. తాత్కాలిక ఉపాయం మాత్రమే’’ అని బలోచ్ పేర్కొంది. ఈనేపథ్యంలో ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్‌కు సూచించింది (Baloch Liberation Army)
అలాగే తమను ఫారిన్ ప్రాక్సీ(విదేశీ మద్దతు ఉన్న) ఉగ్రవాదులంటూ వస్తోన్న విమర్శలను బీఎల్ఏ తోసిపుచ్చింది. ‘‘మేము కీలుబొమ్మలం కాదు. అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోము. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత, భవిష్యత్తు సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. మా పాత్ర గురించి మాకు పూర్తిగా తెలుసు’’ అని వెల్లడించింది. తనను తాను డైనమిక్, నిర్ణయాత్మక పార్టీగా అభివర్ణించుకుంది.
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. అయితే, దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5 శాతం మాత్రమే. అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుంది. పేదరికం కూడా ఎక్కువే. జనాభా తక్కువగా ఉండటంతో అభివృద్ధికి దూరమైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని.. వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు శనివారం బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. 51 లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. అయితే దానిపై అధికారికంగా ఏ ప్రకటనా రాలేదు. శుక్రవారం కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై తిరుగుబాటుదారులు దాడి చేయగా.. 22 మంది సైనికులు మరణించినట్లు సమాచారం.జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్, అందులో ప్రయాణిస్తున్న సైనికులను… ఇటీవలే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ సభ్యులు హతమార్చారు. దీంతో బీఎల్ఏ సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది.