Nuclear Weapons: పాకిస్తాన్ అణుస్థావరంపై భారత్ దాడి చేసిందా.?

పహల్గాం (Pahalgam) ప్రాంతంలో ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడి భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ వెల్లడించింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో మే 7న పాకిస్తాన్ తో పాటు PoKలోని పలు ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మహ్మద్ వంటి నిషేధిత సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు భారత్ పేర్కొంది. అయితే పాకిస్తాన్ అణ్వాయుధ స్థావరంపై (Nuclear Weapons) భారత్ దాడి చేసినట్లు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గేలా చేసిందని చెబుతున్నాయి.
పాకిస్తాన్ అణ్వాయుధ స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు కచ్చితమైన సమాచారం లేదు. భారత ప్రభుత్వం కూడా తాము కేవలం ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే దాడులు చేసినట్లు ప్రకటించింది. పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ మీడియాతో పాటు కొన్ని అంతర్జాతీయ నివేదికలు లాహోర్, రావల్పిండి, కరాచీలలో భారీ పేలుళ్లు జరిగాయని తెలిపాయి. నూర్‌ఖాన్ వైమానిక స్థావరం దెబ్బతిన్నట్లు పేర్కొన్నాయి. ఈ దాడులు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీశాయని, దీంతో పాక్ ప్రభుత్వం ఒత్తిడిలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అణ్వాయుధాల వినియోగం గురించి హెచ్చరించినప్పటికీ, దేశం ఉనికికే ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఉపయోగిస్తామని చెప్పారు. ఈ పరిస్థితి పాకిస్తాన్‌ను రక్షణాత్మక స్థితికి తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది.
పాకిస్తాన్ అమెరికా (America) శరణు కోరినట్లు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఉద్రిక్తతలు తీవ్రతరమైన సమయంలో అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే యుద్ధంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ఇరు దేశాలు శాంతియుత పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. రెండు అణ్వాయుధ శక్తుల మధ్య ఘర్షణ ప్రపంచ శాంతికి ముప్పు కావడంతో అమెరికా జోక్యం అనివార్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మే 10న భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి ఊరట కలిగించింది. ఈ నిర్ణయానికి పలు కారణాలు ఉన్నాయి. రెండు దేశాలు పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకోలేదు. దీంతో గౌరవప్రదంగా వెనక్కి తగ్గాలని భావించాయి. అమెరికా, సౌదీ అరేబియా, బ్రిటన్ వంటి దేశాల ఒత్తిడి కీలక పాత్ర పోషించింది. అణ్వాయుధ ఘర్షణ భయం ఇరు దేశాలను సంయమనం పాటించేలా చేసింది. 1999 కార్గిల్ యుద్ధం (Kargil War) తర్వాత ఇలాంటి తీవ్ర ఉద్రిక్తత మరోసారి నెలకొనడం అణు నిరోధక శక్తికి పరీక్షగా మారిందని కొందరు అభిప్రాయపడ్డారు.
అమెరికా జోక్యం వెనుక భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. దక్షిణాసియాలో (South Asia) స్థిరత్వం అమెరికా విదేశాంగ విధానంలో కీలకమైనది. ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ సాన్నిహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధ ఘర్షణ ప్రపంచ ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన కూడా అమెరికాను జోక్యం చేసుకునేలా చేసింది. సౌదీ అరేబియా, టర్కీ వంటి మిత్ర దేశాలతో కలిసి అమెరికా దౌత్య చర్చలను వేగవంతం చేసింది. ఫలితంగా కాల్పుల విరమణ సాధ్యమైంది.