Delhi: పాక్ తో యుద్ధంలో ‘ఆకాశ’మే హద్దుగా…

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఇండియా (India). సిందూర్ ఆపరేషన్ లో భాగంగా…పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఫలితంగా పాకిస్తాన్ కు రక్షణ పరంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ దాడులతో రగిలిన పాకిస్తాన్… కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణ ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు తుర్కియే నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణులను ప్రయోగించింది. అయితే వీటిని మార్గమధ్యలోనే మన ఆకాశ్ (Akash) క్షిపణులు అడ్డుకున్నాయి.
ఆకాశ్ అంటే..
ఇది భూతలం నుంచి గగనంలోకి ప్రయోగించే క్షిపణి. పరిధి 30 కిలోమీటర్లు. శత్రు క్షిపణులను, డ్రోన్లను అడ్డుకునే సత్తా వీటి సొంతం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌తో దీన్ని పోల్చవచ్చు.
ఆకాశ్ పనితీరుపై..
రాడార్లు గగనతలంపై నిఘా ఉంచుతాయి. ఇతర డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులు వచ్చే దిశ, ఎత్తు.. తదితర అంశాలను గమనిస్తాయి. దాదాపు 120 కి.మీ.పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి. ఆకాశ్‌ను రాజేంద్ర అనే రాడార్లు మార్గదర్శకం చేస్తాయి. ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్‌కు సమాచారమిస్తాయి. అనంతరం ఆకాశ్ క్షిపణి వెళ్లి ఆ వస్తువును కూల్చివేస్తుంది. మార్గమధ్యంలో తన దిశను మార్చుకునే సౌలభ్యం కూడా ఆకాశ్‌కు ఉంది.
కొత్త తరం ఆకాశ్..
కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతనతరం ఆకాశ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే దీనికి సంబంధించిన చేపట్టిన పరీక్షలు విజయవంతమయ్యాయి. దీని రేంజ్‌ను కూడా 70 కి.మీ.వరకు పెంచనున్నారు.