Torento: కెనడా విదేశాంగమంత్రిగా అనితా ఆనంద్.. ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది..?

కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలోనే ఆయన తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ (Anita Anand)కు చోటు దక్కింది. కెనడా (Canada) కొత్త ప్రభుత్వంతో ఆమెకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించారు.
గతంలో మెలోనీ జోలీ విదేశాంగ శాఖను నిర్వర్తించగా.. ఆమె స్థానంలో అనితా ఆనంద్‌ను నియమించారు. ఇక, మెలోనీకి పరిశ్రమల శాఖను కేటాయించారు. భారత సంతతికి చెందిన అనిత గతంలో రక్షణమంత్రిగా వ్యవహరించారు. తాజాగా విదేశీ వ్యవహారాల బాధ్యతలు (Foreign Minister) అందుకున్న ఆమె.. భగవద్గీత చేత పట్టుకొని ప్రమాణస్వీకారం చేశారు.
ఎవరీ అనితా ఆనంద్..
తమిళ, పంజాబీ మూలాలున్న 58 ఏళ్ల అనితా ఆనంద్ (Indian Origin Anita Anand).. కెనడాలోని నోవాస్కోటియాలోని కెంట్‌విల్లేలో జన్మించారు. తల్లి సరోజ్ దౌలత్‌రామ్ అనస్తీషియాలజిస్ట్. ఆమెది పంజాబ్ కాగా, జనరల్ సర్జన్ అయిన తండ్రి సుందరం వివేక్ స్వస్థలం తమిళనాడు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి అనిత. ఈమెకు ఇద్దరు చెల్లెళ్లు గీత, సోనియా ఉన్నారు.
పొలిటికల్ సైన్స్‌లో అకడమిక్ డిగ్రీ చదివిన ఆమె.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. డల్హౌసీ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యలో మాస్టర్స్ చదివారు. కార్పొరేట్ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో లా ప్రొఫెసర్‌గా, విజిటింగ్ లెక్చరర్‌గా, బోర్డు సభ్యురాలిగానూ పని చేశారు. ఆపై రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
లిబరల్ పార్టీ సభ్యురాలిగా 2019లో హౌస్ ఆఫ్ కామన్స్ ఓక్‌విల్లే నుంచి మొదటిసారి ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ.. అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. కెనడాలో ఈ పదవిని అలంకరించిన మొదటి హిందూ మంత్రిగా ఘనత సాధించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్షణమంత్రిగానూ వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల్ని ఆరికట్టి కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందుకుగానూ పలు పురస్కారాలు అందుకున్నారు. లింగసమానత్వం, డైవర్సిటీ, ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం గళమెత్తారు. ఆ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్‌ను అనిత వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.