Taliban: పాకిస్తాన్ దాడులకు తాలిబన్ల ప్రతీకారం.. గెలిచామని అఫ్లాన్ల సంబరాలు..!

తమను తక్కువగా అంచనా వేసి, దాడులకు దిగిన పాక్ సైన్యానికి గట్టి షాకిచ్చింది తాలిబన్ సైన్యం. సరిహద్దుల్లోని చెక్ పోస్టులపై దాడులు చేసి కొన్నింటిని స్వాధీనం చేసుకుంది కూడా. ఈదాడుల్లో పలువురు పాక్ సైనికులు చనిపోయారు. తాలిబన్ దాడులతో భయపడిన పాక్ సైనికులు.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి కూడా.
పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన యుద్ధంలో తాలిబన్‌లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. అఫ్గన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
పాకిస్థాన్తో జరిగిన ఘర్షణలో తమ సైన్యం చూపిన ధైర్యం ప్రశంసనీయమని, ఆఫ్ఘనిస్థాన్ గగనతలాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పామని ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు అంటున్నారు. ఆఫ్ఘన్ సైన్యానికి, తాలిబాన్ యోధులకు మద్దతుగా యువత, స్థానిక ప్రజలు అనేక నగరాల్లో గుమిగూడారు. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. “పాకిస్థాన్ మన భూభాగాన్ని ఉల్లంఘించి ఉండకపోతే, ఆఫ్ఘనిస్థాన్ వారిపై ఇలాంటి దాడులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మేము ఇతర పొరుగువారితో సరిహద్దులను పంచుకుంటున్నాం. అయినప్పటికీ వారితో మా సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. మేము బాగానే ఉన్నాం. కానీ.. పాకిస్థాన్ బుద్ది సరిగ్గా లేదు. పాక్ సమస్యలకు నిలయంగా మారింది.” అని నంగర్‌హార్ నివాసి మొహమ్మద్ నాదర్ అన్నారు.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు పాక్ రక్షణ విశ్లేషణ సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ దాడులపై పాక్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.