Donald Trump: ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా పాలసీ
భారతీయులకు ఉపయోగమేనా?
అమెరికాలో ప్రస్తుతం అమలులో ఉన్న వీసా పాలసీని మార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) అడుగులు వేస్తున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో వరుస పెట్టి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. ఇప్పటివరకు సాగిన దానికి భిన్నమైన రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. అమెరికాకు నైపుణ్యం.. మేధోతనంతో తప్పించి మిగిలిన అంశాల్ని ప్రాతిపదికగా తీసుకోకపోవటం తెలిసిందే. వీసా జారీకి ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా పెట్టుబడిదారులకు.. సంపన్న వలసదారులకు వీలుగా గోల్డెన్ కార్డు(Golden Card) వీసాల్ని జారీ చేస్తామని.. దీంతో అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సులువు అవుతుందని ఆయన చెబుతున్నారు.
ఇందులో భాగంగా అమెరికాలో 5 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.44 కోట్లుగా చెప్పొచ్చు. ఇంత భారీ పెట్టుబడులు పెట్టే వారికి గోల్డ్ కార్డును మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారని.. వాళ్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లించ టంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారని ఆయన చెబుతున్నారు. ఈ వీసా విధానం చాలా వరకు విజయవంతం అవుతుందని తాము భావిస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో ఈబీ5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డుతో భర్తీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఇది ఒకరకంగా శాశ్వత నివాస హోదాగా చెబుతున్నారు. చట్టబద్ధ పెట్టుబడిదార్ల పౌరసత్వం.. శాశ్వత నివాసాన్ని కల్పించేందుకు ఇది సాయం చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈబీ5 వీసా విధానాన్ని 1990 నుంచి అమలు చేస్తున్నా.. ఈ వీసా విధానంలో మోసాలు జరుగుతున్నట్లుగా గుర్తిం చారు. కొందరు అక్రమంగా నిధులు పొందుతున్న విషయాన్ని నాలుగేళ్ల క్రితం ఒక అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో ఈబీ5 వీసాలకు గోల్డెన్ వీసాగా మార్చనున్నారు. ఇప్పటివరకు ఈబీ5 వీసాలకు ప్రతి ఏటా పరిమితంగా మాత్రమే జారీ చేసేవారు. అందుకు భిన్నంగా గోల్డ్ కార్డుపై అలాంటి పరిమితులు ఉండవని చెబుతున్నారు. తమ ప్రభుత్వం కోటి గోల్డ్ కార్డుల్ని ఇవ్వనున్నట్లుగా ట్రంప్ చెబుతున్నారు. ఈ తరహా గోల్డెన్ వీసాల్నిప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలు జారీ చేస్తున్నాయి.
భారతీయులపై ప్రభావమెంత?
గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువ. కానీ, 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టగలిగే సంపన్న భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందడం ఈ విధానం ద్వారా తేలికవుతుంది. ఈ వీసా వల్ల వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్లు వేగంగా అమెరికా పౌరసత్వం పొందే వీలుంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డ్ కోసం లైన్లో ఉన్న భారతీయులకు గోల్డ్ కార్డ్ వీసా ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు. ఇబి 5 వీసా ప్రోగ్రామ్ లో ఇప్పటికే భారతీయులు పెద్ద మొత్తంలో లాభ పడుతున్నారు. కానీ, గోల్డ్ కార్డ్ వీసాతో సంపన్న వర్గం మాత్రమే ప్రయోజనం పొందుతుంది. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డ్ కార్డ్ వీసా అమెరికా వలస విధానంలో కీలకమైన మార్పును సూచిస్తుంది. సంపన్న భారతీయులు దీని వల్ల లాభపడుతుండగా, గ్రీన్‌కార్డ్ కోసం వేచి ఉన్న మధ్య తరగతి వర్గం నిపుణులకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. గోల్డ్ కార్డ్ విధానం ద్వారా రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు అమెరికా గ్రీన్‌కార్డు పొందే అవకాశం పొందుతారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల జాబితాలో భారతీయులు అధికంగా ఉన్నప్పటికీ, ట్రంప్ ఈ కొత్త ఆఫర్ ద్వారా సంపన్న భారతీయులు మరింత వేగంగా తమ అమెరికా పౌరసత్వ కలను సాకారం చేసుకునే అవకాశం లభించనుంది.







