Tri-State Telugu Association: ఘనంగా ట్రైస్టేట్ తెలుగు ఉగాది వేడుకలు
చికాగోలో ప్రముఖ తెలుగు సంస్థ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ (Tri State Telugu Association) ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలను ఏప్రిల్ 5, 2025న స్థానిక మానవ సేవా మందిర్ లో సంస్థ అధ్యక్షులు శ్రీ దిలీప్ రాయపూడి నేతృత్వంలో వైభవోపేతంగా జరుపుకుంది ఉగాది శ్రీరామనవమి (Ugadi Srirama Navami) పండుగల సంస్కృతి ఉట్టిపడేటట్టుగా అలంకరించబడిన వేదిక అందర్నీ ఆకర్షించింది. ప్రార్థన గీతంతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వచ్చినవారికి ఉగాది పండుగ శుభాకాంక్షలను, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను దిలీప్ రాయపూడి వివరించారు.
ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రార్థనాగీత నృత్యాలతోనూ, శాస్త్రీయ నృత్యాలతోనూ సాగిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. స్థానిక తెలుగు బడులు ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకుల మన్నలను పొందాయి. జానపద గీతాలతో పాటు చిత్రగీతాలకు అన్ని తరాల ఔత్సాహికులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఉత్తేజభరితులను చేశాయి. స్థానిక కర్రీ నాన్ స్టాప్ రెస్టారెంట్ వారు ఉగాది పచ్చడి, పానకంతో సహా సమకూర్చిన ఉగాది/ శ్రీరామనవమి విందు విశేషాదరణ పొందింది. తెలుగు భాషే ప్రధానంగా పండుగ వాతావరణంలో జరిగిన కార్యక్రమాలను కిక్కిరిసిన ప్రేక్షకులు ఆద్యంతం తిలకించి ఆనందించారు.








