TANA: తానా – మంచి పుస్తకం ఆధ్వర్యంలో తెలుగులో బొమ్మల కథల పుస్తకాలు – 2025
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు భాష సంరక్షణ, పరివ్యాప్తి కోసం కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా మంచి పుస్తకం (హైదరాబాద్) సంస్థతో కలిసి బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం పదేళ్ల లోపు పిల్లల కోసం తెలుగులో బొమ్మల కథల పుస్తకాలు 2025కి రచనలు ఆహ్వానిస్తోంది. కథాంశం ఏదైనా తీసుకోవచ్చు. రచయితలు తమ పుస్తకాలను పంపించేటప్పుడు ఈ సూచనలను పాటించాలి.
ఒక్కొక్క పేజీలో 10-12 వాక్యాలకు మించి ఉండకూడదు. కథ చదవటానికి సరదాగా, హాయిగా ఉండాలి. తమాషాగా అనిపించాలి. తల్లిదండ్రులు లేదా అన్న, అక్క చిన్న పిల్లలకు చదివి వినిపించేలా కూడా పుస్తకం ఉండవచ్చు. నీతి కథలు, జానపద కథలు, జంతువుల కథలు కాకుండా సమకాలీన వాతావరణం, అంశాలతో కథ ఉండాలి. పిల్లలలో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించేలా పుస్తకం ఉండాలి.
రచనతో పాటు కథ తమ సొంతమని, ఇంతకు ముందు ఏ రూపంగానూ ప్రచురితం కాలేదన్న హామీ పత్రాన్ని జత చేయాలి. కలం పేరు ఉపయోగించే వాళ్లు అసలు పేరుతో హామీ పత్రాన్ని ఇవ్వాలి. కథ, బొమ్మలు ఒకరే రాయవచ్చు, గీయవచ్చు. లేదా కథ రాసేవాళ్లు, బొమ్మ వేసేవాళ్లు ఒక బృందంగా పని చెయ్యవచ్చు. కథ మాత్రమే రాయగలిగి, బొమ్మలు వేసేవాళ్లు తెలియని వాళ్ల విషయంలో, ఆ కథ ఎంపికైతే బొమ్మలు వేయించే బాధ్యత మేం చేపడతాం.
ప్రక్రియ: ఇది 2 దశలలో ఉంటుంది.
దశ-1: మొత్తం కథ, నమూనా బొమ్మలు మాకు 2025 మార్చి 31 లోపల అందచెయ్యాలి. ఈ దశలో ఎంపికైన కథలు రెండవ దశలోకి వెళతాయి.
దశ-2: ఈ దశకి సుమారు 5 కథా అంశాలను ఎంపిక చేస్తాం. ఒక పుస్తకానికి కథ రాసిన వారికి, బొమ్మలు వేసిన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున పారితోషికం ఇస్తాం. ఒకవేళ ఆశించిన స్థాయిలో రచనలు రాకపోతే 5 కంటే తక్కువ కథలను ఎంపిక చేస్తాం. 2025 మే 31 లోపల బొమ్మలతో పూర్తి చేసి, ముద్రణకు సిద్ధంగా ఉన్న పుస్తకాన్ని అందజేయాలి. ఈ పుస్తకాలన్నింటినీ తానా మంచి పుస్తకంగా కలిసి 2025 జులై నాటికి ప్రచురిస్తుంది. కథ, బొమ్మలపై కాపీరైటు ఆయా రచయితలు, చిత్రకారులకే ఉంటాయి.
మరిన్ని వివరాలకు : కె. సురేష్ – 99638 62926, వాసిరెడ్డి నవీన్ – 98493 10560 సంప్రదించండి.
నిర్వాహకుల నిర్ణయాలపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. వివాదాలన్నింటినీ మేరీల్యాండ్ స్టేట్ న్యాయపరిధిలో పరిష్కరించుకోవాలి.
రచనలు పంపించవలసిన చిరునామా
మంచి పుస్తకం, 12-13-439, వీధి నెం. 1, తార్నాక, సికింద్రాబాదు 500017.
ఇమెయిల్: info@manchipustakam.in







