యాపిల్ కొత్త సీఎఫ్‌ఓ భారతీయుడే

భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌ను యాపిల్ సంస్థ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా నియమించుకుంది. లూకా మేస్త్రి స్థానంలో 2025 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈయన యాపిల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ -అనాలిస్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గత 11 ఏళ్లుగా యాపిల్ ఆర్థిక వ్యూహాలు, కార్యకలాపాలను రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బాచిలర్ ఆఫ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎమ్‌బీఏ చదివిన 52 ఏళ్ల పరేఖ్, ప్రస్తుత బాధ్యతలకు ముందు యాపిల్‌లో వరల్డ్‌వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ బాధ్యతలకు నేతృత్వం వహించారు. యాపిల్‌కు ముందు థామ్సన్ రాయిటర్స్, జనరల్ మోటార్స్ లో వివిధ సీనియర్ నాయకత్వ హోదాల్లో పని చేశారు. కంపెనీ ఆర్థిక నాయకత్వ బృందంలో దశాబ్దంగా పనిచేస్తున్న కెవన్‌కున్న ఆర్థిక మేధో శక్తి వల్లే యాపిల్ తదుపరి సీఎఫ్‌ఓ పదవికి సరైన ఎంపికగా మారారు అని యాపిల్ సీఈఓ టిక్ కుక్ అన్నారు.