కల్కిలో వారిద్దరి పాత్రలవే!
ఎవడే సుబ్రహ్మణ్యం అనే చిన్న సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. నాని నటనకు తోడు విజయ్ దేవరకొండ రిషిగా ఆడియన్స్ ను మెప్పించిన తీరు విజయ్ కు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది.
ఈ సినిమా చూసే సందీప్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఛాన్స్ ను విజయ్ కు ఇచ్చాడని అందరూ అంటారు. ఆ సినిమా తర్వాత విజయ్ కు క్రేజ్ రావడంతో నాని, విజయ్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించింది లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ కాంబో ఒకే సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కల్కి 2898ఏడీలో నాని కృష్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే లీక్‌లు బయటికొచ్చాయి.
ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు నాగ్ అశ్విన్ చేయించే ప్రయాణంలో భాగంగా ఈ ఇద్దరి పాత్రలు కల్కిలో కీలకంగా ఉంటాయంటున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రభాస్ భైరవ కాబట్టి విజయ్ దేవరకొండ కల్కి అని విశ్లేషించారు కానీ అవన్నీ నిజాలు కాదు. మరి నాని, ప్రభాస్, విజయ్ కాంబోలో కల్కిలో సీన్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి. వైజయంతి బ్యానర్ లో సినిమాలు చేసిన వాళ్లంతా కల్కిలో ఏదో చిన్న క్యామియోలో కనిపిస్తారని ముందు నుంచి టాక్ ఉంది. వారందరి క్యారెక్టర్లను స్క్రీన్ మీదే చూపించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయాలని నాగి అండ్ టీమ్ గుట్టుగా ఉంచారని తెలుస్తోంది. జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ క్రేజ్ ను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.






