Sankranthi 2026: టాలీవుడ్ చరిత్రలో భారీ రికార్డ్.. 5 సినిమాలు, 4 హిట్లు.. అదిరిపోయిందిగా
టాలీవుడ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సాధారణంగా పండగ సీజన్లో రెండు లేదా మూడు పెద్ద సినిమాలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, ఈసారి ఏకంగా ఐదు చిత్రాలు బరిలో నిలిచి థియేటర్ల వద్ద జనసందోహాన్ని సృష్టించాయి.
విడుదలైన ఐదు చిత్రాల్లో నాలుగు సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోవడం విశేషం.
ది రాజా సాబ్ (ప్రభాస్): మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్, పండగ సెలవుల వల్ల భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
మన శంకర వరప్రసాద్ గారు (చిరంజీవి): అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించి రేసులో ముందంజలో ఉంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి (రవితేజ): వరుస ఫ్లాపుల తర్వాత రవితేజకు ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. బి, సి సెంటర్లలో ఈ చిత్రం స్టడీగా దూసుకుపోతోంది.
నారీ నారీ నడుమ మురారి (శర్వానంద్) & అనగనగా ఒక రాజు (నవీన్ పోలిశెట్టి): ఈ రెండు చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, శర్వానంద్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
థియేటర్ల కొరత – డిస్ట్రిబ్యూటర్ల సవాల్
సినిమాలన్నీ హిట్ కావడంతో పంపిణీదారులకు థియేటర్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది. టికెట్ల కోసం సామాన్య ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 1 గంటకే షోలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కాసుల వర్షం కురిపిస్తూ, పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.






