Tollywood: 2026 సంక్రాంతి బాక్సాఫీస్.. టాలీవుడ్లో కాసుల వర్షం.. కోలీవుడ్లో నిరాశ
2026 సంక్రాంతి సీజన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సరికొత్త ఊపును తీసుకువచ్చింది. బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాలు కనబరుస్తున్న జోరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లన్నీ ప్రేక్షకుల సందడితో కళకళలాడుతున్నాయి. తెలుగు సినిమాల ప్రభంజనం ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, పండగ సెలవులు ఆ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ఇప్పటికే ఈ చిత్రం పెట్టుబడిలో సగానికి పైగా వసూళ్లను రాబట్టి సేఫ్ జోన్ వైపు దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి అనిల్ రావిపూడి బ్రాండ్ తోడయింది.
సమస్యలతో తమిళ ఇండస్ట్రీ..
ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. వరుస పరాజయాల తర్వాత రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా శర్వానంద్ సినిమాకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో షోల సంఖ్యను కూడా పెంచాల్సి వచ్చింది. తమిళనాట నిశ్శబ్దం టాలీవుడ్ పండగ చేసుకుంటుంటే, కోలీవుడ్ మాత్రం ఈ సంక్రాంతికి వెలవెలబోయింది. దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడటం తమిళ బాక్సాఫీస్ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తీకేయన్ నటించిన పరాశక్తి భారీ అంచనాలతో విడుదలైనా డిజాస్టర్ గా నిలిచింది. ఇతర తమిళ సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్ కు భారీ విజయాలను అందించగా, కోలీవుడ్ కు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.






