Raju Weds Rambhai: రాజు వెడ్స్ రాంబాయి’ ఎమోషనల్‌గా సాగే స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ..
‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ లాంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambhai). 15 ఏళ్ళుగా దాచబడి ఉన్న ఓ నిజమైన కథకు రూపం ఈ సినిమా. వరంగల్-ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కథ ఇది. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో నిర్మిస్తున్న ఈ ప్రేమకథ ట్రైలర్ విడుదలైందిప్పుడు. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటిస్తున్నారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా ‘రాంబాయి నీ మీద నాకు మనసాయనే..’ అంటూ సాగే ప్రేమ గీతం సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత స్వచ్ఛంగా ఉండబోతుందో అర్థమైపోతుంది.
ఎలాంటి కల్మషం లేని ఇద్దరు ప్రేమికుల కథ ఇది. సున్నితమైన హాస్యం, మనసును తడిపే ప్రేమ, ఆలోచింపజేసే మాటలు, గుర్తుండిపోయే పాత్రలతో ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్లోనే దాదాపు కథ మొత్తం చెప్పారు దర్శక నిర్మాతలు. చాలా సున్నితమైన కథాంశాన్ని ఇందులో చూపించబోతున్నారు. క్లైమాక్స్ గుండెలకు హత్తుకునేలా ఉండబోతుంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. దోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కాబోతుంది.






