Mutton Soup: ‘మటన్ సూప్’ చిత్రానికి వస్తోన్న స్పందన చూస్తే ఆనందంగా ఉంది – నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్)

అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన చిత్రం ‘మటన్ సూప్’ (Mutton Soup). రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మీడియాతో ముచ్చటించారు. ఆయన ఏం చెప్పారంటే..
మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
మాది తిరుపతి. పుట్టిపెరిగింది అక్కడే అయినా ..నాకు సినిమా రంగంతో అనుబంధాన్ని ఏర్పరించింది మాత్రం హైదరాబాద్. ఈ ప్రాంతమంటే నాకెంతో ప్రత్యేకం. నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే రైటింగ్ మీద దృష్టి పెట్టాను. అన్ని క్రాఫ్ట్‌ల మీద అవగాహన పెంచుకున్నాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ‘బడి పంతులు’ షార్ట్ ఫిల్మ్‌కి రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. నా పేరుని స్క్రీన్ మీద చూడాలని, నేను సినిమాలు చేయాలని మా అమ్మ కలలు కనేవారు. ఆ కల ఇప్పుడు నిజమైంది. కానీ అది చూడటానికి మా అమ్మ గారు లేరు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత అన్ని డిపార్ట్మెంట్లలో పని చేశాను. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. యాక్టింగ్ నేర్చుకున్నాను. ఎంతో మందికి యాక్టింగ్ నేర్పించాను. స్క్రిప్ట్ రాయడంలో నేను దిట్ట. డైరెక్టర్‌గా కూడా నేను ఓ సినిమాను ప్రారంభించాను.
‘మటన్ సూప్’ జర్నీ ఎలా ప్రారంభమైంది?
నా దర్శకత్వంలో ఓ హారర్ మూవీని నేను ప్రారంభించాను. ఆ ప్రాజెక్ట్ చిత్రీకరణ సమయంలోనే నాకు రామచంద్ర పరిచయం అయ్యారు. ఆయన ఆ కష్టపడే తత్వం నాకు చాలా నచ్చింది.
‘మటన్ సూప్’ చిత్రంలో మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటి?
‘మటన్ సూప్’ మూవీకి ముందుగా నేను కో డైరెక్టర్‌గా వచ్చాను. ఆ తరువాత రామచంద్ర ప్యాషన్ చూసి నిర్మించేందుకు ముందుకు వచ్చాను.
నిజ జీవితంలో జరిగి ఘటనల్ని తీసుకుని తెరకెక్కించారు కదా.. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
రియల్‌గా జరిగిన సంఘటనలు కాబట్టి అసలు కథ ఏంటి? అన్నది అందరికీ తెలిసిపోయింది. కానీ ఆ తెలిసిన కథను మేం కొత్తగా చెప్పాం. స్క్రీన్ ప్లేతో అందరినీ మ్యాజిక్ చేశాం. కథగా ఒకలా ఉంటే.. షూటింగ్ చేసిన తరువాత సినిమా మొత్తాన్ని ఎడిటింగ్ టేబుల్ వద్ద మార్చేశాం. మా చిత్రం పేపర్ మీద కాకుండా ఎడిటింగ్ టేబుల్ వద్ద రెడీ అయిందని నేను గర్వంగా చెప్పుకోగలను.
‘మటన్ సూప్’ ఆర్టిస్టుల గురించి చెప్పండి?
మా హీరో రమణ్ మాకు ఎంతో సహకరించారు. వర్ష విశ్వనాథ్ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. జెమినీ సురేష్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని ఇలా అందరూ మాకు సహకరించారు.
‘మటన్ సూప్’ సాంకేతిక బృందం గురించి చెప్పండి?
‘మటన్ సూప్’ సినిమాకు టెక్నికల్ టీం స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడింది. వెంకీ వీణ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన బలమైంది. భరద్వాజ్, ఫణింద్ర విజువల్స్‌కు మంచి పేరు వచ్చింది. టీం అంతా కలిసి చేసిన ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కుతుండటం ఆనందంగా ఉంది. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్.
‘మటన్ సూప్’కు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
‘మటన్ సూప్’ సినిమాకు మంచి స్పందన వస్తోంది. మేం ఊహించినట్టుగానే మా చిత్రంలోని స్క్రీన్ ప్లే చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు. క్రైమ్ కథను అద్భుతంగా ఎడిట్ చేసి చూపించారని ప్రశంసిస్తున్నారు. ఆడియెన్స్ రియాక్షన్స్ చూస్తుంటే మేం ఇన్నేళ్లు పడ్డ కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం.
భవిష్యత్తులో చేయబోతోన్న ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
నేను ఆల్రెడీ దర్శకుడిగా ఓ హారర్ మూవీని స్టార్ట్ చేశాను. అంతే కాకుండా నిర్మాతగానూ కొత్త వారితో మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను. మా రామచంద్రతోనూ మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తాం.