Cameraman Jagadesh: ‘అర్జున్ చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి – కెమెరామెన్ జగదీష్

‘అర్జున్ చక్రవర్తి’ (Arjun Chakravarthi) చిత్రంతో కెమెరామెన్‌గా జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ చీకటి (Cameraman Jagadesh) చెప్పిన సంగతులివే..
మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు సాధించాను. నాకు డ్రాయింగ్, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫోటోగ్రఫీలోనూ మాస్టర్స్ చేశాను. దూరదర్శన్‌లోనూ పని చేశాను. స్టిల్ ఫోటోగ్రఫీలోనూ అవార్డులు వచ్చాయి. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఎన్నో కమర్షియల్ యాడ్స్, ఎన్నో ప్రాజెక్టులను చేశాను. అలా చేస్తున్న సమయంలోనే ‘జత కలిసే’ మూవీకి అవకాశం వచ్చింది. అక్కడ కొత్త వాళ్లందరం కలిసి ఆ మూవీని చేశాం. ఆ సమయంలోనే ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్ నుంచి ‘భైరవ గీత’ ఇలా చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.
సినిమాల్లోకి వస్తానంటే మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది?
మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తారు. నాకు ఎప్పుడూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుండేవారు. నచ్చిన పని ఏదైనా సరే చేయమని, వంద శాతం ఎఫర్ట్ పెట్టమని అనేవారు. అందుకే నేను దూరదర్శన్‌లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాను. అప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
‘అర్జున్ చక్రవర్తి’ విషయంలో మీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
మన ఇండియాలో గొప్ప టెక్నీషియన్లు ఉన్నారు. హాలీవుడ్ స్థాయికి ధీటుగా మనం తీస్తున్నాం. మా ‘అర్జున్ చక్రవర్తి’ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్‌లోనే షూటింగ్ చేశాం. సౌండ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా కూడా దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా ఉంటుంది. సినిమా సక్సెస్‌లో ఈ డిపార్ట్మెంట్‌ల ప్రాధాన్యత చాలా ఉంటుంది. దర్శకుడితో సింక్ అవ్వాలి, ప్రొడక్షన్ సపోర్ట్ ఉండాలి. అప్పుడే రిజల్ట్ బాగా వస్తుంది.
దర్శకులతో ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా?
డీఓపీ అంటే.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ.. అంటే అతను కూడా ఓ డైరెక్టర్ అన్న మాట. అందుకే దర్శకుడితో బాగా సింక్ అవ్వాలి. దర్శకుడి విజన్‌ను అర్థం చేసుకోవాలి.. క్రియేటివ్ ఆఫ్ డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలి. అలా నాకు దర్శకుడితో సింక్ కానప్పుడు ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను.
‘అర్జున్ చక్రవర్తి’ షూటింగ్ టైంలో ఎదురైన సవాళ్లు?
మంచు కురిసే ప్రాంతం కదా అని కాశ్మీర్‌కు వెళ్లాం. కానీ మేం వెళ్లినప్పుడు అక్కడ మంచు పడటం లేదు. దీంతో అక్కడే మంచు కురిసే వరకు ఎదురుచూశాం. అలా చివరకు మైనస్ 8 డిగ్రీల వరకు వెళ్లింది. అలా మంచు కురుస్తుంటే స్వర్గమంటే ఇదేనేమో అన్నట్టుగా కనిపించింది. దీంతో మేం అనుకున్న దానికింటే బాగా షూట్ చేశాం.. విజువల్స్ అద్భుతంగా వచ్చింది. ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌కి చాలా కష్టపడాల్సి వచ్చింది. టెక్నికల్‌గా చాలా ఇబ్బంది ఏర్పడింది. 800 మందిని, ప్లేయర్స్‌ని టైమ్ స్లైస్ అనే ఓ పరికరంతో షూట్ చేయాలని అనుకున్నాం. కానీ అది అందుబాటులో లేకపోయే సరికి అందరినీ ఫ్రీజ్‌లో పెట్టి షూట్ చేశాం. అది చాలా ఎఫెక్ట్‌ను, ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది.
విక్రాంత్ రుద్ర మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
‘భైరవ గీత’ మూవీని చూసిన దర్శకుడు విక్రాంత్ రుద్ర ఈ మూవీకి నన్ను సంప్రదించారు. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాం. అందులో భాగంగానే రకరకాల వేరియేషన్స్‌తో మూవీని తీశాం. పాత్ర తీరు, ప్రయాణానికి తగ్గట్టుగా కలర్ వేరియేషన్స్ చూపించాను. మూడు రకాల కెమెరాలతో షూట్ చేశాం. విజన్ డిఫరెన్స్ ఉండాలని ఎన్ మోర్ఫిక్, స్పెరికల్ లెన్స్‌లను వాడాం. క్యాస్టూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతీ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. డైరెక్టర్ విక్రాంత్ రుద్రకి మంచి టాలెంట్ ఉంది. స్టోరీని బాగా నెరేట్ చేస్తాడు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పేస్తాడు.
‘అర్జున్ చక్రవర్తి’కి అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది కదా?
‘అర్జున చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి.
విజయ్ రామరాజుతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
విజయ్ రామరాజుకి సినిమా పట్ల చాలా ప్యాషన్, డెడికేషన్ ఉంది. ఈ మూవీలో చాలా వేరియేషన్స్ చూపించాడు. రకరకాలుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. కబడ్డీని నేర్చుకున్నారు. సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. ఆయన మీద ఎన్నో ప్రయోగాలు చేశాం. మంచులో అతడ్ని చాలా కష్టపెట్టాం. హీరోయిన్ సిజా రోజ్ కళ్లతోనే నటించేవారు. దయానంద్ గారు వంద శాతం న్యాయం చేశారు.
ఇన్నేళ్ల జర్నీలో నిర్మాత శ్రీని గుబ్బల సపోర్ట్ ఎలా ఉంది?
నిర్మాత శ్రీని గుబ్బల ఓ ఎన్నారై. ఆయనకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఈ మూవీని ఆయన చాలా నమ్మారు. అందుకే మా కోసం చాలా ఏళ్లు అలా టైం ఇచ్చారు. మీకేం కావాలంటే అది చేయండి కానీ.. డబ్బుని మాత్రం వృథా చేయకండని అనేవారు. మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఆయన అండగా నిలబడ్డారు.
‘అర్జున్ చక్రవర్తి’ గురించి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారా?
ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. ‘అర్జున్ చక్రవర్తి’ బాగుందని, అందులో నా వర్క్ బాగుందని మెచ్చుకున్నారు. మనకే ఇదంతా జరిగిందా? అన్నట్టుగా ఉంటుంది. కబడ్డీ ఆటలో మనం ఉన్నామా? అనే ఫీలింగ్ ఇచ్చేలా కెమెరాల్ని కూడా ఆటలో భాగంగా ఆడించేలా ట్రైనింగ్ తీసుకుని షూటింగ్ చేశాం. ఇందులోని కథ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ‘అర్జున్ చక్రవర్తి’ ఎంతో మోటివేషనల్‌గా ఉంటుంది.