Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడికి షాక్.. రెండో స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) సొంతం చేసుకున్నారు. 243 బిలియన్ డాలర్ల సంపదతో ఎల్లిసన్ రెండో ధనవంతుడిగా నిలిచారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో తెలిపింది. మేతో ముగిసిన త్రైమాసికంలో ఒరాకిల్ అంచనాలను మించి ఆదాయం, లాభాలు సాధించింది. మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. ట్రేడిరగ్ సెషన్‌లో ఏకంగా 13 శాతం పెరిగి, మొదటిసారిగా 200 డాలర్లకు చేరాయి. ఒక్క రోజులో ఎల్లిసన్ సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 243 బిలియన్ డాలర్లకు చేరింది. బెజోస్ సంపద 228 బిలియన్ డాలర్లు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సంపద 239 బిలియన్ డాలర్లుగా ఉంది. వీరిని అధిగమించి ఎల్లిసన్ రెండో స్థానం సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) 407 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.