Jubilee Hills: జూబ్లీహిల్స్ రణభేరి.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక (Jubilee Hills ByElection) ప్రచారం ఉధృతరూపం దాల్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ (BRS) సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని ఆ పార్టీ నోటికి తాళం వేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా ఇవాల్టి నుంచి ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఆయన రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉపఎన్నికను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పెద్ద ఎన్నిక ఇదే కావడం, ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం వల్ల విజయం తప్పనిసరి అని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే ఆయన పర్యటనలో ఒక భారీ బహిరంగ సభ కీలకం కానుంది. నియోజకవర్గంలోని కీలక ప్రాంతాలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని ఐదు రోజులపాటు విస్తృతమైన రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సీఎం పర్యటనకు సంబంధించిన బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. సీఎం షెడ్యూల్, రూట్‌మ్యాప్‌లు, సభా ఏర్పాట్లను పక్కాగా రూపొందిస్తూ, ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు ఆయన నిమగ్నమయ్యారు.
కేవలం సీఎం ప్రచారానికే పరిమితం కాకుండా, కాంగ్రెస్ అధిష్టానం ఈ నియోజకవర్గ బాధ్యతలను ముగ్గురు కీలక మంత్రులకు అప్పగించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ లు జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వీరంతా నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. వార్డుల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీగా రాత్రి పగలూ తేడాలేకుండా విస్తృతస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పార్టీ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సానుకూలతను పెంచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వేగాన్ని వివరించడం వంటి అంశాలపై ఈ మంత్రుల త్రయం దృష్టి సారించింది. రేవంత్ రెడ్డి పర్యటనతో వీరి ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుందని, పార్టీలో మరింత జోష్ తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉపఎన్నికను తమ బలం నిరూపణకు వేదికగా భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ రెడ్డి పనైపోయిందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తమదే విజయమని చెప్తూ వస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ కీలక ఉపఎన్నికలో విజయం సాధిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించడానికి బీఆర్ఎస్కు బలం చేకూరుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం, రాష్ట్ర రాజకీయాలపైన.. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వం పట్ల ఆ పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం పెంచడానికి లేదా తగ్గించడానికి కీలకంగా మారుతుంది. అందుకే సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్ తన పూర్తి బలగాన్ని ఉపయోగిస్తోంది.
బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలకు, విమర్శలకు బలంగా సమాధానం ఇవ్వాలంటే ఆ పార్టీ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ బలంగా భావిస్తోంది. ఈ ఉపఎన్నిక విజయం రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కేవలం ఒక స్థానం గెలుపు కోసమే కాకుండా, రాష్ట్రంలో తమ పాలన పట్ల ప్రజల విశ్వాసాన్ని చాటిచెప్పే అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సీఎం స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు సర్వశక్తులూ ఒడ్డి పని చేస్తోంది.







