ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాలంటీర్లపైనే మొదటి సంతకం..! జగన్ స్టేట్‌మెంట్ వెనుక ఇంత కథ ఉందా..?

వాలంటీర్లపైనే మొదటి సంతకం..! జగన్ స్టేట్‌మెంట్ వెనుక ఇంత కథ ఉందా..?

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవహారం ఎంతటి దుమారానికి కారణమవుతోందో మనం చూస్తూనే ఉన్నాం. 2019లో జగన్ గెలిచిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేలా నియామకాలు చేపట్టారు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. నెలకు రూ.5000 చొప్పున భృతి మాత్రమే పొందుతారు. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.

అయితే వాలంటీర్ల నియామకమే పెద్ద దుమారానికి కారణమైంది. వీళ్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయించడం, వివిధ పథకాలన్నీ వీళ్ల ద్వారానే ఎన్ రోల్ చేయించడం.. వంటివి వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా వాలంటీర్ల ద్వారా ఇలాంటి పనులు చేయించడం ద్వారా సమాచారం పక్కదారి పట్టే ప్రమాదం ఉందని విపక్షాలు ఆరోపించాయి. వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న వాళ్లనే వాలంటీర్లనే నియమించుకుంటున్నారని విమర్శించాయి.

వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తూనే వస్తున్నారు. వాళ్లు సేకరించిన సమాచారం స్థానిక వైసీపీ నేతలకు వెళ్తోందని.. అది దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. అయితే వాలంటీర్ వ్యవస్థను వైసీపీ గట్టిగా సమర్థించుకుంటూ వస్తోంది. వీళ్లనే తమ స్టార్ క్యాంపెయినర్లుగా భావిస్తోంది. గత ఐదేళ్లుగా వీళ్లు ప్రజలతో మమేకం అయ్యారు. కాబట్టి ఎన్నికల్లో వీళ్లను సమర్థంగా వాడుకోవాలని వైసీపీ భావించింది.

అయితే తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వారిని విధుల నుంచి తప్పించింది ఎన్నికల సంఘం. దీని వల్ల పింఛను పంపిణీ ఆలస్యమైంది. లబ్దిదారులంతా సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ వల్లేనని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్ తాను అధికారంలోకి రాగానే మళ్లీ వాలంటీర్ల నియామకంపైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి వాలంటీర్ల పదవీకాలం మే 31తో ముగియనుంది. వీళ్లను ఏడాది కాలానికి మాత్రమే నియమించుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ పొడిగిస్తున్నారు. ఇప్పుడు మే 31తో వాళ్ల టర్మ్ పూర్తయితే కొత్తగా వచ్చే ప్రభుత్వమే వీళ్లపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మళ్లీ తానే వస్తానని, వాలంటీర్లను కొనసాగిస్తానని జగన్ చెప్తున్నారు. తద్వారా వాలంటీర్లకు భరోసా ఇవ్వాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని హెచ్చరిస్తున్నారు. అయితే చంద్రబాబు కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మరింత మెరుగ్గా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతామని.. మరింత ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఎవరి మాటలను వాలంటీర్లు విశ్వసిస్తారనేది వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :