ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం..!!

ఏపీలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం..!!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని వాలంటీర్ వ్యవస్థను తొలిసారి వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రవేశ పెట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. వీళ్లకు నెలకు రూ.5000 భృతిని అందిస్తోంది ప్రభుత్వం. వీళ్ల ద్వారానే పింఛన్లు మొదలు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తోంది. స్థానికులకు ఏదైనా అవసరం అయితే దాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా వాలంటీర్లదే. ఇలా వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా మారిపోయారు.

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లు ఉద్యోగులు కారు. స్థానిక వైసీపీ నేతలు తమకు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్లను వాలంటీర్లుగా పెట్టుకున్నారు. వాళ్ల ద్వారా అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్తోందని.. ఇది రాజ్యాంగ విరుద్ధం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై కోర్టులో కేసులు కూడా దాఖలు చేశాయి. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వాలంటీర్లను పక్కన పెట్టాలంటూ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఒక వినతిపత్రాన్ని ఈసీకి ఇచ్చారు. దాన్ని పరిశీలించిన అనంతరం.. వాలంటీర్లను తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

వాలంటీర్లను తప్పించడం వెనుక కూటమి నేతల హస్తం ఉందని.. దీనికి వాళ్లే బాధ్యత వహించాలని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వాలంటీర్లకు వ్యతిరేకంగా తాము లేఖ ఇవ్వలేదని.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వాళ్లకు నెలకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమైంది. స్థానిక నేతలు మౌఖికంగా వాలంటీర్లకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అయితే మెజారిటీ వాలంటీర్లు రాజీనామా చేసేందుకు వెనకాడుతున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే రేపు టీడీపీ అధికారంలోకి వస్తే తమకు అవకాశం లేకుండా పోతుందనేది వాళ్ల భయం. అయితే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. రాజీనామాలు చేయాలని వైసీపీ కోరుతోంది.

గతంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామని చెప్పడంటేనే తాము సక్సెస్ అయినట్లు లెక్క అని వైసీపీ నేత సజ్జల చెప్పారు. చంద్రబాబు మాటలను నమ్మొద్దని.. వాళ్లు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని హెచ్చరించారు. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ మధ్య  వాలంటీర్లు నలిగిపోతున్నారు. రాజీనామా చేస్తే ఒక సమస్య, చేయకపోతే మరో సమస్య. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు వాలంటీర్లు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :