ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సమయం లేదు మిత్రమా..

సమయం లేదు మిత్రమా..

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపికి గట్టిదెబ్బే తగిలింది. మోదీ మేనియా, హిందూత్వ ప్రచారం .. పెద్దగా ఫలితమివ్వలేదు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన కాంగ్రెస్.. అఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది. మరోవైపు..  మోదీ ఛరిష్మా, హిందూత్వం అన్ని ఎన్నికల్లో విజయాలు సాధించిపెట్టవని.. అరెస్సెస్ అధికారిక మ్యాగజైన్ ఆర్గనైజర్ బీజేపీని హెచ్చరించడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రివ్యూ నిర్వహించిన ‘ఆర్గనైజర్’.. కర్ణాటకలో హిందూత్వం, మోదీ మేనియా పనిచేయలేదని.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వ్యూహం బీజేపీ ఓటమికి కారణమైందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా.. పక్కా ప్రణాళికతో ముందుకెళితే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీకి ఇదే సరియైన సమయం అని ఇప్పుడు మేలుకోకపోతే అంచనాలు తారుమారు కావొచ్చని ఆర్గనైజర్ హెచ్చరించింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆ పార్టీ నేతల అవినీతే ప్రధాన కారణమని.. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మొదటిసారి అవినీతిని సమర్థించుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు... కర్ణాటక ప్రజలను ఆకర్షించేందుకు విశేషంగా దోహదపడిందని స్పష్టం చేసింది. అత్యధిక శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో ఓట్లను రాబట్టడంలో బీజేపీ పూర్తిగా విఫలం కావడం..సిట్టింగ్ మంత్రులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీ నష్టపోయిందని ఆర్గనైజర్ తేల్చి చెప్పింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయస్థాయి నేతలు కీలకపాత్ర పోషించారని సంఘ్ పత్రిక స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో లోకల్ లీడర్లను వినియోగించుకోవడంలో సక్సెస్ సాధించిన కాంగ్రెస్ భారీవిజయాన్ని సాధించింది. ఓ కుటుంబం నడిపిస్తున్నపార్టీ.. ఈ ఎన్నికల్లో ఐకమత్యాన్ని చాటడమే కాకుండా.. 2018 ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే 5 శాతం ఓట్లను అధికంగా సాధించగలిగింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన పెద్ద పెద్ద హామీలను ఎలా నెరవేరుస్తుందో.. ఎంతకాలం స్థిరమైన పరిపాలన అందిస్తుందో కాలమే నిర్ణయిస్తుందని ఆర్గనైజర్ తెలిపింది.

కర్ణాటక ఎన్నికల్లో కుల సమీకరణ నిర్మోహమాటంగా జరిగిందని తేలిపోయింది. ఉత్తర, దక్షిణ భారతం అంటూ ఓ వైపు.. భాషా పునర్వవస్థీకరణ అంటూ మరోవైపు ఓట్లను దండుకున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని ఆర్గనైజర్ ఆరోపించింది. ఇటువంటి దీర్ఘకాలిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండానే బీజేపీ ప్రజల్లోకి వెళ్లడమే ఆ పార్టీ ఓటమికి కారణమని తెలిపింది.

ఓట్లను సంపాదించడంలో మతపరమైన గుర్తింపు పాత్ర కీలకంగా మారింది. మతం కూడా బీజేపీ ఓటమికి మరో కారణమని.. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు కర్ణాటక ముస్లింలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయడం..నర్మగర్భంగా క్రిస్టియన్లు చేతులు కలపడంతో కాంగ్రెస్‌ విక్టరీ సాధించిందని ఆర్గనైజర్ వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :