ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రజాగళం సభ సక్సెసా..? ఫెయిలా..?

ప్రజాగళం సభ సక్సెసా..? ఫెయిలా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎన్డీయే కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇన్నాళ్లూ టీడీపీ, జనసేన కూటమికి దూరంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు వాటితో జతకట్టింది. మూడు పార్టీలూ కలిసి సీట్ల సర్దుబాటు పూర్తి చేశాయి. ప్రచారాన్ని కూడా షురూ చేశాయి. అందులో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు.

టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరిన తర్వాత కూటమిని గ్రాండ్ గా లాంఛ్ చేయాలని ఆ పార్టీలు భావించాయి. అందుకే చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీని ఆహ్వానించాయి. మోదీ కూడా అంగీకరించడంతో ఈ తొలి సమావేశం సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ భారీ బహిరంగసభ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. పొత్తు అవసరాన్ని మూడు పార్టీలూ వివరిస్తాయేమోనని ఆశించారు. ఏపీకి ప్రధాని మోదీ వరాలు కురిపిస్తాయేమోనని ఆశించారు.

చిలకలూరిపేట సమావేశానికి భారీగా జనం హాజరయ్యారు. జనాన్ని తరలించడంలో పార్టీలన్నీ సక్సెస్ అయ్యాయి. అయితే సభ నిర్వహణలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అయిందని చెప్పే పరిస్థితి లేదు. సమావేశ నిర్వహణలో లోపాలు కనిపించాయి. మైక్ చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. అయితే వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయకుండా పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అందుకే మైక్ కు అంతరాయం ఏర్పడిందని కూటమి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రధాని మోదీ ప్రసంగం చప్పగా సాగింది. రాష్ట్రానికి ఏమైనా వరాలు ఇస్తారేమోనని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్, వైసీపీ రెండూ ఒక్కటే అని ఆరోపించడం, జగన్ అవినీతిని ప్రస్తావించడం తప్ప వేరే అంశాల జోలికి పోలేదు.

మోదీ స్పీచ్ విన్న వాళ్లంతా అమరావతి శంకుస్థాపన సమయంలో ముంతడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో జగన్ ను మోదీ కడిగేస్తారని.. తమ ముందు ఎలా సాగిలపడ్డారో చెప్తారని టీడీపీ, జనసేన నేతలు భావించారు. మోదీ విమర్శించడం మొదలు పెడితే దాన్ని పట్టుకుని అల్లుకుపోవాలని ఆశించారు. అయితే వాళ్ల ఆశలపై మోదీ నీళ్లు చల్లారు. ఈ సమావేశంలో మళ్లీ బీజేపీతో ఎందుకు కలవాల్సి వచ్చిందో టీడీపీ స్పష్టంగా చెప్పలేకపోయింది. పైకి రాష్ట్ర ప్రయోజనాలకోసం అని చెప్తున్నా.. అది స్వప్రయోజనాలకోసమేనని అర్థమవుతోంది. మొత్తంగా కూటమి తొలి సభ ఆశించినమేర సాగలేదనే చెప్పాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :