టైమ్స్ స్క్వేర్ పై ఎన్టీఆర్ చిత్రాల సమాహారం
న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. నందమూరి తారక రామారావు గారి చిత్రమాలిక మే 27 నుంచి 28వ తేదీ అర్థరాత్రి వరకు కనుల విందు చేసింది. మే 27 అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలిక టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించేలా ఎన్నారై టీడిపి యుఎస్‌ఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ సహాయ సహకారాలతో ఎన్నారై టీడీపీ అమెరికా ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ విభిన్న క్యారెక్టర్లను ఈ డిస్ ప్లే పై ప్రదర్శించారు. విశ్వరూపాల తాలూకా చిత్రాలతో కనువిందు చేసిన ఈ ప్రకటనలు న్యూయార్క్‌కు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. పలువురు తెలుగువారు ఈ ప్రకటనను చూసేందుకు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద గుమిగూడారు. న్యూయార్క్‌కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యాటకులు కూడా ఈ ప్రకటను తిలకించి ఎన్టీఆర్ గురించి తెలుసుకున్నారు.
‘అన్న ఎన్టీఆర్’ శత జయంతిని పురస్కరించుకుని ‘జయరాం కోమటి’ పర్యవేక్షణలో ఎన్నారై టీడీపీ క్రింద 28 నగరాల్లో ఉన్న కార్యనిర్వాహక కమిటీ సభ్యులంతా కలిసి శతవత్సర వేళ, తొలి ప్రయత్నంగా ఏర్పాటు చేసిన ‘అన్న ఎన్టీఆర్’ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను, తెలుగుదేశం పార్టీ అభిమానులను సంతోషపెట్టింది.