ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాటు..నాటు.. పాట లో ఏముంది? 

నాటు..నాటు.. పాట లో ఏముంది? 

ఆస్కార్ పురస్కారం అందుకున్న RRR చిత్ర గీతం నేడు ప్రపంచమంతా ప్రభంజనంలా అన్ని దిక్కులా వినిపిస్తోంది.

ఒక్కసారిగా కోట్లమంది హృదయం కొల్లగొట్టిన పాట - ప్రపంచవేదిక మీద తొలిసారిగా ఆసియాఖండం నుండి, అందునా మన తెలుగు గడ్డ నుండి దూసుకు వచ్చిన పాట - ఆస్కార్ అవార్డ్ ను అవార్డు కైవసం చేసుకున్న "నాటు నాటు నాటు" పాట. "RRR" చిత్రం కోసం కీరవాణి గారి సంగీత సారథ్యంలో గీత రచయిత చంద్రబోస్ గారు రాసిన అచ్చ తెలుగు జానపద నృత్య గీతం"నాటు నాటు నాటు " పాటని ఇష్టపడని తెలుగువాడు ఉండడు.

"ఇది మన పాట, మన తెలుగుదనం ఉన్న పాట, వీక్షకులు అవాక్కయ్యేలా మన అభిమాన హీరోలు స్టెప్పులు వేసిన పాట. కనక మనకి నచ్చింది. మరి పాశ్చాత్య దేశాలలోని నూట అయిదుగురు జ్యూరీ సభ్యులకు ఎందుకు అంతలా నచ్చింది? లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్, రెహానా వంటి ప్రపంచ ప్రఖ్యాత గాయనీమణుల పాటలను వెనక్కి నెట్టి, గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకొనే అంత గొప్పతనం ఆ పాటలో ఏముంది?"

అన్న విషయాలు ఆయన ద్వారానే తెలుసుకోవాలన్న కుతూహలంతో గీతరచయిత చంద్రబోస్ గారిని సంప్రదించినప్పుడు , ఆ పాటలోని సాంద్రత బోధపడేలా ప్రతీవాక్యానికీ అర్థం వివరించి చెప్పారు. ఆయన చెప్పిన అర్థం ఇలా నా వాక్యాల్లో మీ ముందు ఉంచుతున్నాను.

ముందుగా ఆ పాటను ఒక్కసారి ఆసాంతం గమనిద్దాం.

పల్లవి:-

పొలంగట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో
పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరపతొక్కు కలిపినట్టు

నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు

చరణం1#

గుండెలదిరిపోయేలా
డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు…వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…ఊర నాటు
నాటు నాటు నాటు…గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు…ఉక్కపోతలాగ తిక్క నాటు

చరణం 2#

భూమి దద్దరిల్లేలా
ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటు…వాహా…ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
దూకెయ్ రో సరాసరి
నాటు నాటు నాటు

ఈ పాట రాయవలసిన నేపథ్యం గురించి దర్శకులు రాజమౌళి గారు గీతరచయిత చంద్రబోస్ గారికి చెప్పినప్పుడు 'ఇది నృత్య ప్రథానగీతం, సాహిత్యంలో సబ్జెక్ట్ మాత్రం మీ ఇష్టం' అని పూర్తి స్వేచ్ఛని ఇచ్చారుట.

'నృత్య ప్రథాన గీతం కాబట్టి, చిత్రం ప్రకారం వందేళ్ళ క్రితం నాటి కథ కాబట్టి- ఆనాటి పల్లె ప్రజల నృత్యoలో ఉన్న ఊపు, వేగం, నాటుదనం, తెలుగుదనం గురించి ఈనాటి యువతకు అర్థం అయ్యే రీతిలో అచ్చతెలుగు పదాల అల్లికతో ఒక పాట రాయాలి' అని భావించారు చంద్రబోస్ గారు. ఇలాంటి చక్కని సందర్భం, స్వేచ్ఛా దొరికినప్పుల్లా తెలుగు భాషాభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు ఆయన. ఈ పాటలో అంతర్లీనంగా ఉన్న ఎన్నో అంశాలలో ఒకటి - కథలో రామ్ ఆంధ్రా నించీ, భీమ్ తెలంగాణ నించీ వస్తారు కనక, ఆయా మాండలికాలు కుడా అక్కడక్కడా స్పృశించారు రచయిత. ఇంకా లోతుగా గమనించే కొద్దీ అంతర్లీనంగా ఎన్నో ప్రత్యేకత అంశాలు ఉన్నాయి ఈ పాటలో. అవన్నీ ఈ వ్యాసంలో ముందుకెళ్ళే కొద్దీ సంపూర్ణంగా తెలుస్తాయి. ఈ నాటు పాట ఇప్పటి మాస్ సాంగ్ అనే పదానికి అప్పటి తెలుగు రూపం. అప్పట్లో నాటు - మోటు - మొరటు వంటి అచ్చతెలుగు పదాలు వాడేవారు పల్లెల్లో.

ఈ నాటు పాటలో నృత్యo ఎలా ఉండబోతోందో పల్లవిలోనే చెప్పారు కవి.

"పొలంగట్టు దుమ్ములోన పొట్లగిత్త దూకినట్టు" అనడంలో ఒక పల్లె పౌరుషం కనిపిస్తుంది.

"పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్ట" అనడంలో పల్లె సంప్రదాయ నృత్యంలో ఉన్న భక్తి, చిన్న గగుర్పాటుతో పాటు గొప్ప ఊపు, వేగం, పారవశ్యం... తెలీకుండానే పక్కవాడి చేత కూడా కాలు కదిపించే గుణo కనిపిస్తుంది

"కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సెసినట్టు" అనడం ఒక కుర్రకారు సాహస విన్యాసాన్ని సూచిస్తుంది.

"మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు" అంటే ఒక సంఘటిత యువశక్తికి సూచకం.

"ఎర్రజొన్న రోట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు" అనడం ఆనాటి మన వ్యవసాయ సంప్రదాయాన్ని, ఆర్థిక స్థితినీ, ఆహారపుటలవాట్లనీ, అదిచ్చే చేవనీ సూచిస్తుంది.

పల్లవిలో ఆ నాటు నాట్య విన్యాసాలను- ఆనాటి మన సామాజిక అంశాలలోని చేవతో పోల్చారు.

మొదటి చరణంలో... ఆ నృత్యం వల్ల ఒంట్లోని ప్రతీ అంగం ఎలా పూనకాలతో పులకరించిపోతోందో చెప్పారు చంద్రబోస్ గారు.

"గుండెలదిరిపోయేలా డoడనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్ట
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తోక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు"

అనడంలో ఆ పల్లె నాటు నృత్యానికి గుండె అదురు పెరిగి, వేళ్లతో చిటికెలు వేసి, కాలు కదం తొక్కి, ఒళ్ళు చెమట పట్టి ఆపాదమస్తకం పరవశంతో ఊగిపోతుంది అని స్వభావోక్తి అలంకారం స్ఫురించేలా చెప్పారు కవి. ఇక్కడ కీసుపిట్ట గురించి చెప్పుకోవాలి, ఇదేదో పిచ్చుకలాగా కాలగర్భంలో కలిసిపోయిన పిట్ట కాదు, తెలంగాణా మాండలీకంలో కీసుపిట్ట అంటే ఈల వేయడం.ఇది పాతకాలం నాటి పల్లెపదం.

అలాగే రెండో చరణంలోని ఉపమానాలలో కవితాత్మక భావావేశం గోచరిస్తుంది.

"భూమి దద్దరిల్లేలా... ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా,
దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా దుముకుదుముకులాడేలా"

అనడంలో, వేగం హెచ్చిన నాట్యం వల్ల రక్తం అంతా ఎగజిమ్మడాన్ని కూడా రోషంగా, కవితాత్మకంగా..."రగతమంతా రంకెలేసి ఎగరడం" అంటూ పౌరుషాన్నీ, పోటీతత్వాన్ని సూచించేలా గొప్పగా భావవ్యక్తీకరణ చేశారు రచయిత.

"లోపలున్న ప్రాణం అంతా ఆవేశంగా ఉప్పొంగింది" అనే ఉత్ప్రేక్షని తెలంగాణా మాండలీకంలో "లోపలున్న పానమంతా దుముకు దుముకులాడటం" అంటూ కవితాత్మకoగా వ్యక్తపరిచారు చంద్రబోస్ గారు.

అలాగే, తొక్కు, కీసుపిట్ట, పానం దుముకులాడటం వంటి తెలంగాణ మాండలీకాలనీ, వాటితోపాటే ఆంధ్రా మాండలీకాలనీ కుడా సమానంగా పాటనిండా పోదిగారు రచయిత.

కళారూపం ఏదయినా... అది ప్రజల వాడుక మాటల్లో ఉన్నప్పుడే అది అన్ని వర్గాల వారిని చేరి సంపూర్ణత్వం సంతరించుకొని పదికాలాల పాటు నిలబడుతుంది.

ఇంత భావసాంద్రత ఉన్న ఈ పాటను "గోల్డెన్ గ్లోబ్" జ్యూరీలోని సభ్యులయిన దర్శకులు, రచయితలు, విమర్శకులు, సామాన్య శ్రోతలు, విభిన్న విభాగాలకు చెందిన నూటయిదుగురు జడ్జీలు, ఆంగ్లంలోకి అనువదించుకొని, ప్రతీ మాటను క్షుణ్ణంగా అవగతం చేసుకొని, అందులో అభ్యంతరకరమైన అంశాలు కానీ, ఎవరి మనోభావాలు దెబ్బతినే అంశాలు కానీ లేవని ఒకటికి వందసార్లు గమనించుకొని, భావవ్యక్తీకరణ శైలిని కుడా గమనించి ఒక నిర్ణయానికి వచ్చారు, శ్రోతల ఉత్సాహం ద్విగుణీకృతం చేసే గొప్ప సంగీతం అందించిన కీరవాణి గారి బాణీ కుడా, నూటైదుగురు జ్యూరీ సభ్యులకు వంక పెట్టడానికి లేనివిధంగా నచ్చి ఈ గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డుని సగర్వంగా ప్రకటించారు.

"చరిత్రలో నీకో కొన్ని పెజీలుండాలి" అని తన కలంతో చెప్పి ఆగక, దాన్ని నిజం చేసి చూపించారు చంద్రబోస్ గారు.

ఇది చదివిన తర్వాత  ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకు  ఆస్కార్  ఇచ్చారో ఈ పాటకి, రచయితకు, సంగీత దర్శకునికి.

Great award for Great Song

(From Whatapp Collection)

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :