ASBL NSL Infratech

భారత ఎన్నికల మహాసంగ్రామం - 2024.. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి....

భారత ఎన్నికల మహాసంగ్రామం - 2024.. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి....

సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ, మరోవైపు ఇండియా అలయెన్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. దేశంలోని మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కొనసాగుతోంది. భారతదేశ ఎన్నికలంటే మాటలు కాదు.. మొత్తంగా వందకోట్లకు పైబడిన దేశంలో ఎన్నికలు ఏకపెట్టున నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే సుదీర్ఘంగా ఏడుదశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ.. అంటే సుదీర్ఘంగా 43 రోజుల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఫలితాలను జూన్ 4న వెల్లడిస్తారు.

తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. తమిళనాడులోని 39 సహా ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లలో అన్ని లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్‌ పూర్తయింది. ఇక రెండోదశలో దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది.మూడో దశ ఎన్నికలు 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్నాయి. మొత్తం పన్నెండు రాష్ట్రాలలో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నారు.. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పోలింగ్ జరగనుంది.

నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.5వ దశలో భాగంగా మొత్తం 8 రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్‌సభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లోని 57 అసెంబ్లీ స్థానాలకు, చివరిగా ఏడో దశలో 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తర, దక్షిణాది కీలకం..

అయితే మూడు,నాలుగో దశల్లో ఉత్తరాది రాష్ట్రాల్లోని కీలకస్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పలువురుప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక నాలుగోదశ అయితే దక్షిణాదిలోని కీలక రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.మరీ ముఖ్యంగా ఈదశలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్నిస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో అధికస్థానాలు ఆశిస్తున్న అధికార, విపక్ష కూటములకు ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఎన్డీఏ టార్గెట్ 400 సీట్స్

ఇక హ్యాట్రిక్ విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉన్న మోడీ సర్కార్.. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు, ఓన్లీ బీజేపీకి 370 సీట్లు సాధనే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే దూరమైన మిత్రపక్షాలను ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించి పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు పోటీగా రంగంలోకి దిగిన ఇండియా అలయెన్స్... ఈసారి ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తామంటోంది. ముఖ్యంగా మిత్రపక్షాలు బలంగా ఉన్నచోట ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెెళ్తోంది.

యూపీపై ప్రధానంగా బీజేపీ ఫోకస్..

ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. దేశంలోనే అతి ఎక్కువ ఎంపీస్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గత ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ బీజేపీ 62 స్థానాలు దక్కించుకుంది. ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామంటోంది బీజేపీ. అందుకే యూపీపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఓవైపు ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్..రాష్ట్రంపై పట్టు బిగించారు. దీనికి తోడు అయోధ్యలో భవ్య,దివ్య రామాలయ నిర్మాణం.. తమ ఘనతే అని పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ. దీంతో ఈసారి కూడా తాము గ్యారంటీకి అత్యధిక సీట్లను గెలుస్తామంటోంది బీజేపీ.

మహారాష్ట్రలో ఎన్డీఏ సానుకూల వాతావరణం

తర్వాతి స్థానం పరిశీలిస్తే మహారాష్ట్రలో 48 పార్లమెంటు స్థానాలున్నాయి. అయితే ఇక్కడ విపక్షాలను చీల్చడంలో బీజేపీ విజయవంతం కావడంతో.. ఈసారి కూాడా ఎన్డీఏ హవా కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ విపక్షాల్లోని కీలకనేతలు ఇప్పుడు ఎన్డీఏలో ఉండి మరాఠా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీంతో ఈరాష్ట్రంలో ఎన్డీఏ పరిస్థితి నల్లేరుపై నడకనే చెప్పొచ్చు.

బిహార్ లో ఎన్డీఏకు కాస్త గడ్డు పరిస్థితి

బిహార్.. ఇక్కడ 40 ఎంపీ స్థానాలున్నాయి.అయితే గత ఎన్నికల మాదిరిగా మాత్రం.. ఈసారి బిహార్ లో ఎన్డీఏకు అంతసానుకూల పవనాలు ఉన్నట్లు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సీఎం నితీష్ కప్పదాటు వైఖరితో... ప్రజల్లో వ్యతిరేక భావన వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్.. గ్రౌండ్ స్థాయిలో వర్క్ ప్రిపరేషన్ గట్టిగానే చేస్తున్నారు.ఈసారిఎలాగైనా నితీష్ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు గట్టి షాక్ ఇస్తామంటున్నారు.

బెంగాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ..

బెంగాల్లో మాత్రం ఎన్డీఏను ఎలాగైన గట్టి దెబ్బ కొట్టాలని దీదీ ప్రయత్నిస్తున్నారు. దీదీని గద్దె దించాలని గతంలో ప్రయత్నించి ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బీజేపీ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రస్తావిస్తూ ముందుకెళ్తోంది. ఇక్కడ బీజేపీ, దీదీ చెరిసగం సీట్లు సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈరాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ స్థానాలున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ఏడు ఎంపీ స్థానాలను గతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం అందులో కొన్ని ఎన్డీఏకు వచ్చేలా కనిపిస్తోంది.మరీ ముఖ్యంగా ఆప్ ను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం.. కొంతవరకూ బీజేపీకి ఇబ్బందికరంగా మారొచ్చు. మరోవైపు.. ఆప్ లీడర్లు వరుసగా జైలుకెళ్తుండడంతో.. ఆపార్టీ వీక్ అవ్వడం వల్ల తాము బలోపేతం కావొచ్చన్నది బీజేపీ హైకమాండ్ భావనగా కనిపిస్తోంది.

గుజరాత్ బీజేపీ కోట..

గుజరాత్.. మోడీకి పెట్టని కోట. ఇక్కడ పూర్తిగా బీజేపీ హవానే కొనసాగుతోంది. ఈసారి కూడా కాంగ్రెస్ కు పెద్ద అవకాశాలుండకపోవచ్చని సమాచారం. ఇక్కడి వ్యాపార వర్గాలు..పూర్తిగా కమలదళానికి మద్దతుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు అగ్రకులాలు, వెనకబడిన వర్గాలు సైతం..మోడీ సర్కార్ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్.. హస్తం చేజారాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే.. కాంగ్రెస్ బలం కాస్త తగ్గి, బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం ప్రభావం అధికంగా ఉంది. ఈసారి కూడా అక్కడ మళ్లీ కమలం వికసించొచ్చని అంచనాలున్నాయి. అయితే మణిపూర్ లో మాత్రం.. కమలానికి గడ్డు పరిస్థితి ఉండొచ్చని తెలుస్తోంది.

తెలంగాణ కీలకం..

ఇక దక్షిణాదికి వస్తే.. తెలంగాణలో డబుల్ డిజిట్ పై బీజేపీ కన్నేసింది. ఇతర పార్టీల నుంచి లీడర్లను లాక్కుని.. వారిని నిలబెట్టండం ద్వారా బలపడే ప్రయత్నం చేస్తోంది. అంటే అక్షరాలా బెంగాల్ ఫార్ములా అనుసరిస్తోంది. అయితే ఇదే సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డిలాంటి గట్టి లీడర్.. కాంగ్రెస్ కు ఉన్నారు.దీంతో ఎంతవరకూ బీజేపీ తన లక్ష్యాన్ని నెరవేరుస్తుందన్నది అనుమానంగా ఉంది.

ఏపీతో నో ప్రోబ్లెం...

ఇక ఏపీ విషయానికొస్తే.. బీజేపీకి పెద్ద ఇబ్బంది లేదని చెప్పాలి. ఒకటి ఎన్డీఏలో ఉన్న టీడీపీ, జనసేన.. మద్దతుగా నిలుస్తున్నాయి. ఓవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన జగన్ కూడా.. ఓరకంగా బీజేపీకి గట్టి మద్దతుదారనే చెప్పాలి. ఏపార్టీ అధికారంలోకి వచ్చినా , ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. ఇక కర్నాటకలో బీజేపీకి అధికస్థానాలు సాధించేందుకు అవకాశాలున్నాయి. కానీ ఆపార్టీలో లీడర్ల మధ్య అనైక్యత, వార్థక్యంతో ఇబ్బంది పడుతున్న యడ్యూరప్ప.. కమలాన్నిసతమతం చేస్తున్నాయి. ఇక తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. ఎందుకంటే విపక్షాలతో పోలీస్తే ఇక్కడ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే .. చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఒడిషాలో నవీన్ పట్నాయక్.. ప్రజల మనిషి. ఆయన ఉండగా.. మరేపార్టీకి ప్రజల నుంచి పెద్దగా ఆదరణ ఉండదన్నది అక్కడి రాజకీయ నిపుణుల అభిప్రాయం.

కేరళలో లెఫ్ట్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధిక స్థానాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం ఓటు బ్యాంక్ అధికం. దీనికి తోడు వందశాతం అక్షరాస్యత ఉన్న ప్రదేశమిది. దీనికి తోడు మత రాజకీయాలకు ఇక్కడ పెద్దగా చోటుండే పరిస్థితి లేదు. ఓవరాల్ గా గమనిస్తే ఎన్డీఏ కూటమికి 300 సీట్ల దగ్గరగా రావొచ్చని, ఇండీ కూటమికి 150 నుంచి 200 స్థఆనాలు వస్తాయంటున్నారు. ఏరకంగాచూసినా ప్రస్తుతానికి మోడీ ప్రభుత్వం తిరిగి రావొచ్చన్న సంకేతాలున్నాయి. ఈ పరిస్థితి ఓరకంగా బీజేపీకి ఆనందాన్ని కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :