ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్న కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు మౌనంగా ఉన్నారు: కిషన్ రెడ్డి

కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్న కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు మౌనంగా ఉన్నారు: కిషన్ రెడ్డి

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టును కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తున్న కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే అది కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. మజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, విచారణలో భాగంగా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, ఏ మాత్రం బాధ్యత లేకుండా, సమాధానం ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ కేసులో తమ కుటుంబానికి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సంబంధం లేదని కేసీఆర్‌ చెప్పగలరా? అని నిలదీశారు. లిక్కర్‌ పాలసీలో ఢిల్లీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందనడానికి సాక్ష్యాలున్నాయని, అక్కడ (ఢిల్లీలో) తీగ లాగితే ఇక్కడ (తెలంగాణలో) డొంక దొరికిందని అన్నారు.

‘‘కేజ్రీవాల్‌, కవిత అరెస్టును దేశమంతా స్వాగతిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్‌తో చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తాం. కేజ్రీవాల్ అరెస్టును రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తున్న కేసీఆర్.. ఢిల్లీ సీఎం తప్పు చేయలేదని నిరూపించగలరా? అలాగే కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన కేసీఆర్‌.. కవిత అరెస్టుపై ఎందుకు స్పందించడం లేదు? కవిత అరెస్టు విషయంలో ఆయన మౌనానికి కారణమేంటో కేసీఆర్‌ ప్రజలకు వివరించాలి.’’ అంటూ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :