ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు

అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్‌ లేఅవుట్‌.. ఓవైపు గండిపేట చెరువు, మరోవైపు ఔటర్‌ రింగ్‌రోడ్డు.. ఆకాశహర్మ్యాలతో అద్భుతంగా కనిపించే ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌..  విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో భూముల ధరలు నగరం నడిమధ్యనే కాదు శివారు ప్రాంతాల్లో సైతం బంగారాన్ని మించిపోతున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతంగా పేరు పొందిన, కోకాపేట చెరువు ప్రాంతంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అభివృద్ధి చేసిన కోకాపేట నియోపొలిస్‌ ప్రాంతం ఇప్పుడు దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చూసేలా తయారైంది. ఇటీవల అక్కడ జరిగిన భూముల వేలం రికార్డులను క్రియేట్‌ చేసింది.  ఎకరా రూ.100.75 కోట్లు పలికి దేశంలోనే అత్యధిక ధరగా నిలిచింది. అలాగే కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా..  బుద్వేల్‌లోనూ నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలానికి కూడా అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది. 

బుద్వేల్‌లో...

బుద్వేల్‌లో హెచ్‌ఎండిఎ నిర్వహించిన వేలంలో భూముల ధరలు ఊహించని విధంగా అమ్ముడు పోయాయి. దాదాపు రూ.42 కోట్లు పలికింది. వందెకరాల విస్తీర్ణంలోని పద్నాలుగు ప్లాట్లకు  జరిగిన ఈ-వేలంలో దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. నిర్దేశిత ధర కంటే 181 శాతం ఎక్కువకు కంపెనీలు భూములను దక్కించుకున్నాయి. బుద్వేల్‌ భూముల ద్వారా రెండువేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేయగా.. దాన్ని తలదన్నేలా రూ.3,625.73 కోట్లు వచ్చాయి. సుమారు 182 ఎకరాల్లో 17 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ ఇక్కడ భారీ లేఅవుట్‌ను రూపొందించింది. 100.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లకు మొదటి విడతగా ఈ-వేలం నిర్వహించారు. నిర్దేశిత కనీస ధర ఎకరాకు రూ.20 కోట్లుగా నిర్ధారించి చేపట్టిన ఈ-వేలంలో అనేక కంపెనీలు పోటీపడ్డాయి. 3.47 ఎకరాలు మొదలు 14.33 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో వేలం నిర్వహించారు. ఉదయం సెషన్‌లో 58.11 ఎకరాల విస్తీర్ణంలోని ఏడు ప్లాట్లలో విస్తీర్ణం అధికంగా ఉన్న నాలుగో నెంబరు ప్లాటు అత్యధికంగా ఎకరాకు రూ.39.25 కోట్ల ధర పలికింది. ఎనిమిది, పదో నెంబరు ప్లాట్లు ఎకరాకు రూ.35.50 కోట్ల ధర పలకగా.. మిగిలినవి కూడా రూ.33-34 కోట్ల మధ్యనే అమ్ముడుపోయాయి. మొదటి సెషన్‌లోనే రూ.2,057.67 కోట్లు వచ్చింది. రెండో సెషన్‌లో 41.90 ఎకరాల విస్తీర్ణంలోని మిగిలిన ఏడు ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. ఏడిరట్లో మూడు ప్లాట్లు రూ.40 కోట్ల మార్కును దాటాయి. గరిష్ఠంగా 15వ నంబరు ప్లాటు ఎకరా 41.75 కోట్లు పలకగా, కనిష్ఠంగా 14వ నంబరు ప్లాటు 33.75 కోట్లు పలికింది. రెండో సెషన్‌లో రూ.1,568.06 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు సెషన్లలో కలిపి సరాసరిన ఎకరా 36.25 కోట్ల వరకు అమ్ముడుపోయింది. మొత్తం 100.01 ఎకరాలకు హెచ్‌ఎండీఏకు 3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో హైదరాబాద్‌ సహా బెంగళూరు, ముంబైకి చెందిన దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి.

మోకిలలో...

మోకిలలో హెచ్‌ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్‌కు సమీపంలో హెచ్‌ఎండీఏ భారీ లేవుట్‌ను అభివృద్ధి చేసి ఆన్‌లైన్‌ వేలం నిర్వహించింది. సోమవారం నిర్వహించిన వేలంలో చదరపు గజానికి రూ.గరిష్ఠంగా రూ.1,05,000 లక్షలు, కనిష్ఠంగా రూ.72వేలు చొప్పున మొత్తం 50 ప్లాట్లను విక్రయించారు. అన్ని ప్లాట్లకు కలిపి చదరపు గజానికి సరాసరి రూ.80,397 ధర పలికిందని, రెండు సెషన్‌లలో జరిగిన ఆన్‌లైన్‌ వేలంలో మొత్తం రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఒక్కో ప్లాటు కనీస మద్దతు ధరను రూ.25వేలుగా నిర్ణయిస్తే, అంతకు మూడు రెట్లు అధికంగా కొనుగోలుదారులు చెల్లించి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ట్రిపుల్‌ వన్‌ జీవోను ఎత్తివేశామని ప్రకటించింది. అయినా, దీనిపై పూర్తి స్థాయి స్పష్టతను ఇవ్వలేదు. ఎందుకంటే, ఈ అంశానికి సంబంధించిన జీవో కూడా విడుదల కాలేదు. ఆయా ప్రాంతాల్ని గ్రీన్‌ జోన్‌గా డెవలప్‌ చేస్తామని సగర్వంగా ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ ను రెడీ చేయలేదు. ఈ క్రమంలో కోకాపేట్లో హెచ్‌ఎండీఏ తలపెట్టిన వేలం పాట ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ట్రిపుల్‌ వన్‌ జీవో ప్రభావం ఈ వేలంపై పడుతుందా? ఎవరైనా అక్కడికొచ్చి అధిక ధరను వెచ్చించి కొంటారా? ఒకవేళ బిల్డర్లు రేటెక్కువ పెట్టి స్థలాన్ని కొన్నా.. అధిక రేటుకు ఫ్లాట్లను అమ్మవచ్చా? ఇలాంటి అనేక సందేహాల నేపథ్యంలో కోకాపేట్‌ వేలం జరిగింది. కొందరు ముందే ఊహించినట్లుగానే అధిక రేటుకే హెచ్‌ఎండీఏ ప్లాట్లను విక్రయించింది. నగరానికి చెందిన హ్యాపీ అనే సంస్థ సుమారు రూ.100 కోట్లను వెచ్చించి దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకుంది. మరి, దీన్ని ప్రభావం రియల్‌ రంగంపై ఎలా ఉంటుందన్నదానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఎకరానికి రూ.100 కోట్లు పలకడంతో.. ల్యాండ్‌ లార్డ్స్‌ ఆశలకు పట్టాపగ్గాలు ఉండనే ఉండవిక! ఇంతింటి భూమి రేట్లు ఉంటే.. ఆకాశహర్మ్యాల్ని కట్టలేమని కొందరు బిల్డర్లు ఇప్పటికే వాపోతున్నారు. మరికొందరేమో కోకాపేట్‌ ను వదిలేసి ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ట్రిపుల్‌ వన్‌ జీవో తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో కోకాపేట్‌లోని కొన్ని ప్రాజెక్టుల్లో నేటికీ ఫ్లాట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదని సమాచారం. కొందరు బడా బిల్డర్ల ప్రాజెక్టుల్ని మినహాయిస్తే.. యాభై శాతానికి పైగా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ఎన్నికల సీజన్‌ ఓ ప్రధాన కారణమని కొందరు రియల్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదీఏమైనా, చదరపు అడుక్కీ రూ.7,000 నుంచి రూ.8,000 రేటున్న ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్లు అమ్మడుకావట్లేదు. అలాంటిది, ఎకరం రూ.100 కోట్లు పెట్టి స్థలం కొన్న ప్రాజెక్టుల్లో అమ్మకాలు ఏ విధంగా జరుగుతాయేమోనని కొందరు డెవలపర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏదీ ఏమైనా ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల భూముల ధరలు పెరుగుతాయని, మరికొన్ని చోట్ల ఉండకపోవచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కోకాపేటలో..

కోకాపేటలో ఎకరానికి రూ. 100.75 కోట్లు.. ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం లభించింది. కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డుస్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్‌ వర్గాల్లో సంచలనంగా మారింది.  కోకాపేట నియో పోలిస్‌ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ. 100.75 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది. ఎకరం భూమి సగటున రూ. 73.23 కోట్లు పలికింది.కోకాపేట నియో పోలిస్‌ ఫేజ్‌-2లో 45.33 ఎకరాలకు హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించింది. తొలి సెషన్‌లో ఫేజ్‌-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం నిర్వహించగా, రెండో సెషన్‌లో 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో షాపూర్‌ జీ పల్లోంజి, ఎన్‌సీసీ, మైహోం, రాజ్‌పుష్ఫ తదితర ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. నియో పోలిస్‌ ఫేజ్‌-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

10వ నెంబర్‌ ప్లాట్‌లోని ఎకరం భూమి ధర అత్యధికంగా రూ. 100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 10వ నెంబర్‌ ప్లాట్‌ను ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రాజపుష్ప, హ్యాపీ హైట్స్‌ కలిసి రూ. 362.70 కోట్లకు దక్కించుకున్నాయి. 7.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 11వ ప్లాట్‌లో ఎకరం ధర అత్యల్పంగా రూ. 67.25 కోట్లు ధర పలికింది.

రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోంది: కేసీఆర్‌

రాజధానిలో భూముల ధర ఎకరాకు రూ.100 కోట్లకుపైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శమని, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి, ఇంత ధర చెల్లించి మరీ తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధిం చిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు.  తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్‌ ఆత్మ గౌరవాన్ని కించ పర్చిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, కృషికి దక్కిన ఫలితమిది..’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇది రియల్‌ బూమ్‌గా మారుతుందా...?

కోకాపేట్‌లో జరిగిన తాజా వేలం పాటలు.. హైదరాబాద్‌ రియల్‌ రంగం భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తుందా? అగాధంలోకి పడేస్తుందా? లేక మరింత అభివృద్ధి దిశగా తీసుకెళుతుందా? అనే అంశంపై మార్కెట్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ప్రభుత్వమే ధరలు పెరిగేలా చూసిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దానికితోడు కొన్ని నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతోపాటు బిల్డర్లు తమ ఇష్టారీతిన ఎన్ని అంతస్తులైనా కట్టుకునే అవకాశాలను కూడా కల్పిస్తోందంటున్నారు. అందువల్లనే ఇంత ఎక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు బిల్డర్లు ముందుకు వచ్చారని చెబుతున్నారు. 

కాగా మరోవైపు ఒక్కసారిగా పెరిగిన ధరల బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని గమనిస్తే  పెద్దఅంబర్‌పేట, కీసర, మేడ్చల్‌ వరకు ఎక్కడా ఎకరా మార్కెట్‌ ధర పది కోట్లు లేదు. అసలు కొనేవాళ్లు కూడా పెద్దగా లేరు. గడిచిన సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్‌లతో ఈ సంవత్సరం లావాదేవీలను పోల్చి చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. అలాగే హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో కలిసి సుమారు రెండు లక్షల ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగా పడివున్నాయని ఒక అంచనా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్‌ ఒన్‌ జీవో ఇచ్చిన ప్రాంతం కోకాపేట ప్రాంతాన్ని ఆనుకునే ఉంటుంది. ఇప్పుడా జీవోను రద్దు చేసినందువల్ల  ఆ ప్రాంతమంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ సూత్రం ప్రకారం భూముల ధరలు తగ్గాలి. కానీ, ఈ సహజ పరిణామాన్ని సవాల్‌ చేస్తూ కోకాపేట భూములు మాములుగా కూడా ఒక్కసారిగా భగ్గుమనేలా పెరిగింది. అదే అందరిలోనూ సందేహాన్ని రేకెత్తిస్తోంది. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :